పెంచిందెంత… దించిందెంత?

చెల్లెళ్ల కష్టాలు చూడలేక అన్నయ్య ఎంతో ప్రేమతో, అనురాగంతో, అప్యాయతతో కూడిన ‘పెద్ద బహుమతి’ని ఇచ్చారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చి పదేండ్లవుతోంది. ఇప్పటికీ చాలా రాఖీ, ఓనం పండగలు వచ్చి పోయాయి. కానీ ఆయనకు ఎన్నడూ లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందో! పైగా తగ్గించిన ధరతో ప్రజలు పండగ చేసుకో వాలని సోషల్‌మీడియాలో ఆయన పరివారం నేతలు కొన్ని సందేశాలను వైరల్‌ చేస్తున్నారు. తగ్గింపు వల్ల 33 కోట్ల ఎల్‌పీజీ వినియోగదారులకు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. దీనివల్ల కేంద్ర ఖజానాకి యేటా పడే భారం రూ.7,680 కోట్ల గురించి కూడా వివరించారు. ఖాజానాకు ఏమైనా, ఆర్థికలోటు ఎలా ఉన్నా దేశ ప్రజలే తమకు ముఖ్యమని తమ ‘పెద్దమనసు’ చాటుకున్నట్టున్నారు పాపం! మరి…వచ్చేది ఎలక్షన్ల పండగ కదా! ముందు జాగ్రత్త పడాలి. అందులో ఆరితేరిన వ్యక్తి మన పెద్దాయన. ఆయనకు ఇలాంటివి వెన్నతో పెట్టిన విద్యనాయే. కర్నాటకలో కంగుతిన్నాక ఉన్న గోచీ ఊడకుండా చూసుకోవాలి కదా. అందుకే చెల్లెమ్మలపై హఠాత్తుగా ప్రేమ ఉప్పొంగింది. అయితే మణిపూర్‌లో విభజన రాజకీయాలకు ఎంతోమంది చెల్లెమ్మలు బలయ్యారు. పట్టించుకోలేదు. హర్యానాలో మతం మంటలకు హిందూ, ముస్లింలు ఘర్షణలకు దిగారు. ముందుకు రాలేదు. నాకేం! అనుకున్నాడు. అసలే ఆయన దేశ ప్రజల కోసం రాత్రనక, పగలనక విమానాల్లో ప్రయాణిస్తూ విదేశాల్లో అహర్నిశలు కష్ట పడుతున్నరాయే..! గ్యాస్‌ ధర తగ్గించి ఎన్నికల తాయిలాలకు వేళైందని చెప్పకనే చెపుతూ ఆయన తన ‘ప్రేమ’ను మరోసారి తెరపైకి తెచ్చిండు.
యూపీఏ హయాంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.77, డీజిల్‌ ధర రూ.60, 14.2కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.410. 2014లో ఎన్‌డీయే అధి కారంలోకి వచ్చాక వీటి ధరలు పైపైకే తప్ప క్రూడా యిల్‌ ధరలు తగ్గినా కిందికి దిగి రాలేదు. ఇప్పుడు పెట్రోల్‌ ధర రూ.110 ఉండగా డీజిల్‌ ధర రూ.98, గ్యాస్‌బండ ధర రూ.1155. హైదరాబాద్‌లోనైతే గ్యాస్‌ రూ.1200కు తక్కువ లేదు. అమాంతం రూ.800 పెరిగింది. పైగా గ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ఇంతటి ధరాఘాతాన్ని పేదలు, కూలీ లు, కార్మికులు భరించగలరా? ధరలు తగ్గించండి మహాప్రభో అని ఇన్నేండ్లలో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనికరించని వారు.. ఇప్పుడు రాఖీ కానుక పేరుతో తగ్గించిన గ్యాస్‌ ధరలు దేనికి సంకేతం? ఇది ఎన్నికల స్టంట్‌ కాదా! ఏదైతేనేం తగ్గడం మంచి విష యమే. కాదనలేం. ప్రజలకు ఎంతో కొంత ఊరట కలిగించే అంశం. అయితే ఎన్నికలప్పడే తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలకు దగ్గరవు తామనుకోవడం పొరపాటు. ఎందుకంటే బీజేపీ పాలనలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ద్రవ్యోల్బణం పెరిగింది. నింగినంటిన నిత్యా వసరాల ధరలతో నిత్యం పేదలు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ భారం వెంబడి స్తూనే ఉంది. ప్రజల్ని ఏదో కొత్తగా ఉద్దరించినట్టుగా గ్యాస్‌ ధర తగ్గిస్తే బీజేపీ పాలన బాగున్నట్టా? దీనికి దేశమంతా సంబరాలు చేసుకోవాలా? ఇది నమ్మి ఓటేస్తే నట్టేట ముంచుతారని తెలియని అమాయకులు కాదు ప్రజలు. మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు.
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరం శాసన సభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ప్రజల్లో ఉన్న అసహనాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నమే గ్యాస్‌ధర తగ్గింపని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో మోడీ మత విద్వేషాలతో చేసిన ప్రచారాన్ని ప్రజలు గట్టిగానే తిరస్కరించారు. లౌకికతత్వమే తమ అభిమతమని చాటారు. అక్కడ బీజేపీ ఓటమికి అధిక ధరలు కూడా ఓ కారణమే. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన ఐదు పథకాలు ప్రజల్ని ఆకర్షించినవి. ఆలోచనలో పడేసినవి. కర్నాటక గెలుపుతో దేశంలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు గుబులు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ కమలం పార్టీకి కీలకం. ఎందుకంటే అందులోనూ ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు 65 లోక్‌సభ సీట్లున్నాయి.ఎన్నికల వాతావరణం వచ్చిన తరుణంలో బీజేపీ వైఫల్యాల్లో అధిక ధరలు, గ్యాస్‌మీదే కాంగ్రెస్‌ ప్రధానంగా కేంద్రీకరించింది. తాము అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని చెబుతోంది. ఇప్పటికే రాజస్తాన్‌లో గ్యాస్‌పై అదనపు సబ్సిడీని కూడా అందిస్తోంది. ఇలా చూస్తే వచ్చే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవాలంటే గ్యాస్‌ ధర తగ్గిస్తేగానీ గెలవలేమనే నిర్ధారణకు మోడీ సర్కార్‌ వచ్చింది. అందులో భాగంగానే ఈ తగ్గింపు అనివార్యమైంది. ప్రధానంగా మనం గమనంలో పెట్టుకోవాల్సింది ఒక్కటే. బీజేపీ పదేండ్ల పాలనలో గతంలో పోలిస్తే గ్యాస్‌ధర 115 శాతం పెరిగింది. 2021లోనే పదమూడుసార్లు పెంచింది. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ది పొంద డానికి ధరను తగ్గిస్తున్నారు కానీ మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్‌ ధర రూ.రెండు వేలు అయినా ఆశ్వర్చపోనక్కర్లేదు.