దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా

– కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలి : -మంత్రి హరీశ్‌ రావు

  నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉత్సవాల్లో వైద్యారోగ్యశాఖకు కేటాయించే రోజు నుంచి కిట్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6.84 లక్షల మంది మహిళలకు లబ్దిపొందుతారని తెలిపారు. గర్భం దాల్చిన తర్వాత 14 నుంచి 26 వారాల్లో రెండో ఏఎన్‌సీ సమయంలో, 27 నుంచి 34 వారాల సమయంలో మూడో ఏఎన్‌సీ సమయంలో రెండు సార్లు కిట్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. మొదటి రోజు 24 జిల్లాల్లో 111 కేంద్రాల్లో కిట్ల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో కిట్లను పంపిణీ చేస్తున్న సంగతిని ఆయన గుర్తుచేశారు.
కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించిన తర్వాత 2014లో తల్లుల మరణాల రేటు 92 నుంచి ప్రస్తుతం 43కు తగ్గిందని తెలిపారు. వీటిని తగ్గించడంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకం రూపొందించినట్టు తెలిపారు. నాలుగు ఏఎన్‌సీ చెకప్‌లు, కేసీఆర్‌ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా శిశుసంరక్షణకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. ప్రోటీన్లు, మినరల్స్‌, విటమిన్లు, ఐరన్‌లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్‌ శాతం పెంచడం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యమని తెలిపారు. ఒక్కో కిట్‌ విలువ రూ.రెండు వేలు కాగా, మొత్తం పంపిణీకి రూ.277 కోట్లు ఖర్చవుతున్నట్టు అంచనా వేసినట్టు తెలిపారు. న్యూట్రిషన్‌ కిట్‌లో కిలో న్యూట్రీషన్‌ మిక్స్‌ పౌడర్‌, కిలో ఖర్జూర, ఐరన్‌ సిరప్‌ 3 బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, కప్పు, పల్లి పట్టి 200 గ్రాములు, ప్లాస్టిక్‌ బుట్ట ఉంటాయని స్పష్టం చేశారు.
సిద్ధమైన పల్లె, బస్తీ దవాఖానలు ప్రారంభించాలి…
ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన పల్లె, బస్తి దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని హరీశ్‌ రావు ఈ సందర్భంగా ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన సబ్‌ సెంటర్ల నిర్మాణాలు, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని కోరారు. దూరంగా కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇవి ఏర్పాటు చేయాలని సూచించారు.
అభినందనలు
కంటి వెలుగులో భాగంగా పరీక్షలు చేయడం పట్ల వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులను హరీశ్‌ రావు అభినందించారు. ఇప్పటి వరకు రీడింగ్‌ గ్లాసెస్‌ 21.46 లక్షల మందికి, 13 లక్షల మందికి ప్రిస్కిప్షన్‌ గ్లాసెస్‌ ఇచ్చినట్టు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేతా మహంతి పాల్గొన్నారు.