– ఫోన్ ట్యాపింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసింది ప్రభాకర్‌రావే
– కోట్ల రూపాయల్లో విపక్షాల డబ్బులు సీజ్
– రిమాండ్ రిపోర్ట్‌లో రాధాకిషన్‌రావు వెల్లడి
– నేటికి రాధాకిషన్‌రావు కస్టడీ పిటిషన్ వాయిదా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన విపక్ష ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్నా కొద్ది కొత్త మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ప్రత్యేక టీమ్‌ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎస్‌ఐబీ)కు చెందిన మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు స్వయంగా ఏర్పాటు చేశారని నగర టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు వెల్లడించినట్టు ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. మునుగోడు, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్‌ట్యాపింగ్ ప్రత్యేక టీమ్‌ను ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీలో ఏర్పాటు చేశారనీ, ఇందులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్‌కు చెందిన అదనపు ఎస్పీ వేణుగోపాల్, ఎస్‌ఐబీలోని ప్రణీత్‌రావుతో పాటు తనను ఈ స్పెషల్ టీమ్‌లో నియమించారని రిపోర్ట్‌లో వివరించారు. ఆ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా, ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థులను నియంత్రించటమే టార్గెట్‌గా ఫోన్‌ట్యాపింగ్ చేయటం, దాని ఆధారంగా నిఘా వేయటం, తద్వారా రూ. లక్షల మేర డబ్బులను పట్టుకోవటం జరిగిందని రాధాకిషన్‌రావు వెల్లడించారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఎస్‌ఐబీ ఆఫీసీలో స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌ఓటీ) కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడ ప్రణీత్‌రావు నేతృత్వంలో కార్యాచరణను అమలు చేశారని ఆయన వివరించారు. ముఖ్యంగా, ప్రభాకర్‌రావు నుంచి విపక్ష ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లను ప్రణీత్‌రావు బృందం ట్యాపింగ్ చేసేదనీ, దాని ద్వారా వచ్చిన డబ్బుల పంపిణీ సమాచారాన్ని తమకు అందజేసేవారనీ, ఆ సమాచారం మేరకు తాము నిఘా వేసి, వాహనాలను అడ్డగించి డబ్బులను స్వాధీనపర్చుకునేవాళ్లమని రాధాకిషన్‌రావు వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకుబంధువు కారునుంచి రూ. కోటి, భవ్య సిమెంట్స్ అధినేత కారు నుంచి రూ.70 లక్షలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ఆయన అనుచరుల కారులోనుంచి శ్రీనాథ్‌రెడ్డి అనే ఇన్‌స్పెక్టర్ సహాయంతో రూ.3.5 కోట్లను సీజ్ చేశామని రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో వివరించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు విపక్షానికి చెందిన నాయకులు, వారికి సమీపంగా మెలిగిన వ్యాపారస్థులు ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసి, సమాచారాన్ని ప్రభాకర్‌రావుకు చేరవేశామన్నారు. దీనిపై విచారణను మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. కస్టడీలోని దనపు ఎస్పీలు బుజంగరావు, తిరుపతన్నలను రాధాకిషన్‌రావు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా విచారించారు.