– అదానీ గ్రూపులో మారిషన్ కంపెనీల పెట్టుబడులు
– అవి ఆయన కుటుంబ సన్నిహితులవే
– లిస్టింగ్ చట్టానికి తూట్లు
– ఓసీసీఆర్‌పీ సంస్థ తాజా ఆరోపణలు
– అవినీతి మిత్రులను ప్రధాని రక్షిస్తున్నారు : ప్రతిపక్షాల ఆరోపణలు
న్యూఢిల్లీ: నిబంధనలకు పాతర వేస్తూ అదానీ గ్రూప్ వాటాలలో మారిషస్‌కు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయంటూ వచ్చిన వార్తలు దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పైగా మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ పేరుతో ఈ పెట్టుబడులు పెట్టింది అదానీ కుటుంబ సభ్యుల సన్నిహితులేనని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ) అనే సంస్థ తాజాగా ఆరోపించింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదికను ఫైనాన్షియల్ టైమ్స్, గార్డియన్ పత్రికలు ప్రచురించాయి. నివేదిక బయటకు రావడంతో పలు ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ, అదానీ గ్రూపుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓసీసీఆర్‌పీ నివేదిక ప్రకారం…అదానీ కుటుంబ సభ్యుల సన్నిహితులు మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ పేరుతో అదానీ గ్రూపులో వాటాల కొనుగోలు, అమ్మకాలు సాగించారు. నాసర్ అలీ షబాన్ అలీ, చాంగ్ చుంగ్-లింగ్ అనే వ్యక్తులు ఆఫ్‌షోర్ వ్యవస్థల ద్వారా అనేక సంవత్సరాలుగా అదానీ గ్రూపు వాటాలు కొంటూ అమ్ముతున్నారు. వీరిద్దరికీ అదానీ కుటుంబ సభ్యుల వ్యాపారాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి చెందిన కంపెనీలతో పాటు అదానీ గ్రూపు కంపెనీలలో కూడా వీరికి వాటాలు ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు అదానీ ప్రమోటర్ల తరఫున పనిచేస్తున్నారు. భారత లిస్టింగ్ చట్టం ప్రకారం ఏదైనా గ్రూపులో 75% వరకూ కుటుంబ సభ్యులు, సన్నిహితులు పని చేయవచ్చు. కానీ అదానీ గ్రూపులో ఆ పరిమితి దాటిపోయింది. అయితే చాంగ్, అలీలు అదానీ కుటుంబం ఇచ్చిన సొమ్ముతో పెట్టుబడులు పెట్టారా లేదా అనేది మాత్రం తెలియడం లేదు. కానీ అదానీ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున వీరిద్దరూ ఆ కుటుంబంతో సమన్వయం చేసుకుంటూ వ్యవహారాలు నడిపారని మాత్రం అర్థమవుతోంది.
ఓసీసీఆర్‌పీ నివేదిక చెప్పిన మరో విషయమేమంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు అంటే 2013 సెప్టెంబర్ నాటికి అదానీ గ్రూపు ఆస్తుల విలువ సుమారు ఎనిమిది బిలియన్ డాలర్లు మాత్రమే. అది ఇంతింతై వటుడింతై అన్నట్లు గత ఏడాదికి ఏకంగా 260 డాలర్లకు పెరిగింది. మోడీ ప్రభుత్వ అండదండలే దీనికి కారణమని అర్థమవుతోంది.
అబ్బే…అలాంటిదేమీ లేదు : అదానీ గ్రూపు
తనపై ఓసీసీఆర్‌పీ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ షరా మామూలుగానే ఖండించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలే ఇందులోనూ పునరావృతమయ్యాయని తేల్చేసింది. విదేశీ మీడియా సంస్థల ప్రోద్బలంతో తమను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎదురు దాడి చేసింది.
అవినీతిపరుల కొమ్ము కాస్తున్న ప్రధాని : కాంగ్రెస్
అవినీతిపరులైన స్నేహితులకు, వారి అక్రమ చర్యలకు కొమ్ము కాసేందుకు ప్రధాని ఎంత దూరమైనా వెళతారని తాజా నివేదిక రుజువు చేసిందని కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే రెగ్యులేటరీ, విచారణ సంస్థలను కోరలు తీసిన పాముల మాదిరిగా మార్చారని మండిపడ్డారు. తప్పుడు పనులపై విచారణ జరపడానికి బదులు ఈ సంస్థలు ప్రతిపక్షాలను భయపెట్టేందుకు రాజకీయ సాధనాలుగా మారాయని విమర్శించారు. ‘తాజాగా బయటపడిన వాస్తవాలు వందకు పైగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాయి. హమ్ అదానీ కీ హైన్ కాన్ (హెచ్‌ఏహెచ్‌కే) సిరీస్‌లో భాగంగా అదానీతో ఉన్న మకిలి సంబంధాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానిని ప్రశ్నిస్తోంది. జాతి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలపై ఆయన మౌనం వహిస్తున్నారు’ అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. హిండెన్‌బర్గ్ పరిశోధన చేసిన ఆరోపణలను నిరూపించే సాక్ష్యాధారాలను తాజా నివేదిక అందించిందని కాంగ్రెస్ ప్రతినిధి షమా మొహమ్మద్ తెలిపారు.
పలు పార్టీల మండిపాటు
అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు మోడీ ప్రభుత్వం పార్లమెంటులో నిరాకరించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గుర్తు చేస్తూ వాటాల యాజమానులను ‘బినామీ’గా అభివర్ణించారు. తాజా ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా అదే పార్టీకి చెందిన సాకేత్ గోఖలే సెబీకి లేఖ రాశారు. వాస్తవానికి అదానీపై వచ్చిన ఆరోపణలను సెబీ, ఈడీలు విచారించాలని, అయితే ఆ పనిని ఆ సంస్థలు పాత్రికేయులకు వదిలేశాయని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానిం చారు. అదానీ కుంభకోణం పైన, ప్రశ్నించే గొంతుక ల అణచివేత పైన ప్రధాని మౌనం వహిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మీడియాను నిలువరించడం సాధ్యం కాదని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు.
అదానీపై వివాదంలో మరిన్ని ఆధారాలు: సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు తన కంపెనీల స్టాక్ ధరలను, వాటి విలువను పెంచడానికి అక్రమాలకు పాల్పడిందనే అంశంలో మరిన్ని నూతన సాక్ష్యాధా రాలు వెలవడ్డాయని, కాబట్టి ఈ అంశంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో గురు వారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ అక్రమాలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు ఆధారంగా ది ఫైనాన్సియల్ టైమ్స్, ది గార్డియన్ పత్రికలు కథనాలు వెలువరించాయని పొలిట్ బ్యూరో తెలిపింది. వినోద్ అదానీకి చెందిన ఇద్దరు అత్యంత సన్నిహితులు పెట్టుబడి నిధులను బెర్ముడాలో వినియోగం చేయడం, అదానీలో మిలియన్ డాలర్ల షేర్లను కొనుగోలు చేయడానికి షెల్ కంపెనీలను ఏ విధంగా ఏర్పాటు చేశారో ఈ కథనాలు స్పష్టంగా తెలిపాయని పొలిట్‌బ్యూరో వెల్లడించింది. అదానీ గ్రూప్ కంపెనీలకు విదేశీ నిధుల విషయాన్ని 2014లో సెబీ విచారణ చేసిం దని, అయితే ఆ తరువాత విచారణను ముగించిం దని కూడా ఈ కథనాలు తెలిపాయని పొలిట్ బ్యూరో తన ప్రకటనలో తెలిపింది. అదానీకి ప్రధాన మంత్రి మోడీతో ఉన్న సంబంధాలు కారణంగా స్టాక్ మార్కెట్‌లో విస్తృతంగా జరుగుతున్న మోసాలు, అక్రమాలకు వ్యతిరేకంగా సెబి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా కథనాలు నిర్థారించా యని పొలిట్‌బ్యూరో తెలిపింది. తాజా కథనాలపై పూర్తిస్థాయి విచారణ అవసరం, అదానీ వివాదంలో ఎలాంటి రహస్యాలను లేవని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.