– నమీబియాపై 9 వికెట్లతో గెలుపు
నార్త్‌సౌండ్ : పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతుంది. గ్రూప్ దశలో తొలి మూడు మ్యాచుల్లోనూ కంగారూలు ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. గ్రూప్-బిలో బుధవారం నమీబియాను ఆసీస్ చిత్తుగా ఓడించింది. 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5.4 ఓవర్లలోనే ఊదేసింది. మరో 86 బంతులు ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా (4/12) నాలుగు వికెట్ల మాయజాలానికి జోశ్ హాజిల్‌వుడ్ (2/18), మార్కస్ స్టోయినిస్ (2/9) జత కలిశారు. దీంతో నమీబియా 72 పరుగులకే చేతులెత్తేసింది. కెప్టెన్ ఎరాస్మస్ (36, 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటంతో జట్టుకు కాస్త గౌరవప్రద స్కోరు అందించాడు. ఛేదనలో డెవిడ్ వార్నర్ (20, 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిశ్ హెడ్ (34 నాటౌట్, 17 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (18 నాటౌట్, 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.