ఆసీస్‌ అలవోకగా..!

ఆసీస్‌ అలవోకగా..!– ఛేదనలో డెవిడ్‌ వార్నర్‌ జోరు
– పాట్‌ కమిన్స్‌కు హ్యాట్రిక్‌ వికెట్లు
– బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
– ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌
మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియా అదరగొట్టింది. సెమీఫైనల్‌ బెర్త్‌ వేటను సూపర్‌ 8లో అలవోక విజయంతో మొదలెట్టింది. పేసర్‌ పాట్‌ కమిన్స్‌ (3/29) హ్యాట్రిక్‌ వికెట్లతో విజృంభించగా తొలుత బంగ్లాదేశ్‌ 140/8 పరుగులే చేసింది. ఛేదనలో డెవిడ్‌ వార్నర్‌ (53 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కగా వర్షం అంతరాయం కలిగించినా ఆస్ట్రేలియా 28 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) తేడాతో ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-నార్త్‌సౌండ్‌
వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 141 పరుగుల ఛేదనలో డెవిడ్‌ వార్నర్‌ (53 నాటౌట్‌, 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. ట్రావిశ్‌ హెడ్‌ (31, 21 బంతుల్లో 3 సిక్స్‌లు) రాణించాడు. 11.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 100/2తో ఉండగా వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు, పాట్‌ కమిన్స్‌ (3/29), ఆడం జంపా (2/24) మెరవటంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (41, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), తౌహిద్‌ హృదరు (40, 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన పాట్‌ కమిన్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
వార్నర్‌ ధనాధన్‌ : ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు దంచికొట్టారు. తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 65 పరుగులు జోడించి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌ నుంచి లాగేసుకున్నారు. డెవిడ్‌ వార్నర్‌ (53 నాటౌట్‌), ట్రావిశ్‌ హెడ్‌ (31) దంచికొట్టారు. 35 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో డెవిడ్‌ వార్నర్‌ దూకుడుగా ఆడాడు. అజేయ అర్థ సెంచరీతో బంగ్లాదేశ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ట్రావిశ్‌ హెడ్‌ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో కదం తొక్కాడు. ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ (1) స్వల్ప విరామంలో వికెట్‌ కోల్పోయారు. అయినా, ఆసీస్‌ జోరు తగ్గలేదు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (14 నాటౌట్‌, 6 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)తో కలిసి డెవిడ్‌ వార్నర్‌ ఊచకోత కొనసాగించాడు. దీంతో 11.2 ఓవర్లలో 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవటంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. ఆట కొనసాగించే పరిస్థితులు లేకపోవటంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించారు. డక్‌వర్త్‌ పద్దతిలో 11.2 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరు 72. దీంతో ఆస్ట్రేలియా లక్ష్యం 73 పరుగులు. అప్పటికే 100 పరుగులు చేయటంతో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో రిషద్‌ హుస్సేన్‌ (2/23) రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆ ఇద్దరు మెరిసినా.. : తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఆసీస్‌ బౌలర్లు బంగ్లాదేశ్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. స్పిన్నర్‌ ఆడం జంపా (2/24), పాట్‌ కమిన్స్‌ (3/29) వికెట్ల వేటలో విజృంభించారు. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించగా.. లిటన్‌ దాస్‌ (16, 25 బంతుల్లో 2 ఫోర్లు) నిరాశపరిచాడు. ఓ ఎండ్‌లో కెప్టెన్‌ నజ్ముల్‌ శాటో (41) నిలువగా మరో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. రిషద్‌ హుస్సేన్‌ (2) సైతం నిరాశపరిచాడు. ఈ సమయంలో శాంటో జతకలిసిన తౌహిద్‌ హృదరు (40) బంగ్లాదేశ్‌ను మంచి స్కోరు దిశగా నడిపించారు. ఈ ఇద్దరు నిష్క్రమించిన తర్వాత బంగ్లాదేశ్‌ నుంచి ఎవరూ రాణించలేదు. షకిబ్‌ అల్‌ హసన్‌ (8), మహ్మదుల్లా (2), మెహిది హసన్‌ (0) తేలిపోయారు. పాట్‌ కమిన్స్‌ వరుస బంతుల్లో మూడు వికెట్లు కూల్చి కెరీర్‌ తొలి హ్యాట్రిక్‌ సాధించాడు. 20 ఓవర్లలో 8 వికెట్లకు బంగ్లాదేశ్‌ 140 పరుగులే చేసింది. కీలక బ్యాటర్లు షకిబ్‌ అల్‌ హసన్‌, మహ్మదుల్లా నిరాశపరచటం బంగ్లాదేశ్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపించింది.
స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ : హసన్‌ (బి) స్టార్క్‌ 0, లిటన్‌ దాస్‌ (బి) జంపా 16, శాంటో (ఎల్బీ) జంపా 41, రిషద్‌ (సి) జంపా (బి) మాక్స్‌వెల్‌ 2, హృదరు (సి) హేజిల్‌వుడ్‌ (బి) కమిన్స్‌ 40, షకిబ్‌ (సి,బి) స్టోయినిస్‌ 8, మహ్మదుల్లా (బి) కమిన్స్‌ 2, మెహిది (సి) జంపా (బి) కమినÊ్స 0, టస్కిన్‌ నాటౌట్‌ 13, హసన్‌ షకిబ్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140.
వికెట్ల పతనం : 1-0, 2-58, 3-67, 4-84, 5-103, 6-122, 7-122, 8-133.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 4-0-21-1, జోశ్‌ హేజిల్‌వుడ్‌ 4-1-25-0, పాట్‌ కమిన్స్‌ 4-0-29-3, ఆడం జంపా 4-0-24-2, మార్కస్‌ స్టోయినిస్‌ 2-0-24-1, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 2-0-14-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : డెవిడ్‌ వార్నర్‌ నాటౌట్‌ 53, ట్రావిశ్‌ హెడ్‌ (బి) రిషద్‌ 31, మిచెల్‌ మార్ష్‌ (ఎల్బీ) రిషద్‌ 1, మాక్స్‌వెల్‌ నాటౌట్‌ 14, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (11.2 ఓవర్లలో 2 వికెట్లకు) 100.
వికెట్ల పతనం : 1-65, 2-69.
బౌలింగ్‌ : మెహిది హసన్‌ 4-0-22-0, హసన్‌ షకిబ్‌ 1-0-9-0, టస్కిన్‌ అహ్మద్‌ 1.2-0-22-0, ముస్తాఫిజుర్‌ 2-0-23-0, రిషద్‌ 3-0-23-2.