తెలుగు ప్రజలు ఎందరో తమ కలలు నెరవేర్చుకునేందు రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఉన్నత విద్య… ఇలా రకరకాల కారణాలతో విదేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అలా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారిలో చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా అక్కడి రాజకీయాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, న్యాయస్థానాల్లోనూ తమ సత్తా చాటుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలో విజయవాడకు చెందిన జయ బాడిగ కూడా చేరిపోయారు. అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దాంతో.. కాలిఫోర్నియాలో ఓ కోర్టు జడ్జిగా అపాయింట్ అయిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పదవికి ఎంపికై తొలి తెలుగు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
కృష్ణాజిల్లాకు చెందిన జయ తల్లి బాడిగ ప్రేమలత, గృహిణి. తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ. ఈ దంతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. వీరిలో జయ మూడో కూతురు. జయ పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. ‘నేను సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్‌లో చదివాను. మిషనరీ పాఠశాల కావడంతో సామాజిక సేవపై అవగాహన కలిగింది. అలాగే మా నాన్న నుండి కూడా కొంత నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి సమాజం గురించి ఆలోచించడం అలవాటు. నేను లా చదవాలనేది మా అమ్మ కోరిక. అప్పట్లో నన్ను బయట దేశాలకు పంపడం మా నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఉస్మానియాలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాను’ అంటూ ఆమె తన చిన్నతనం గురించి వివరించారు.
మహిళల సమస్యలపై…
డిగ్రీ తర్వాత జయ అమెరికా వెళ్లి బోస్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ విభాగంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ‘డబ్ల్యూఈవీఈ'(మహిళలు హింసాత్మక వాతావరణం నుండి తప్పించుకోవడం) అనే స్వచ్ఛంద సంస్థలో కొన్నేండ్లు పని చేశారు. అక్కడ మహిళల సమస్యలపై లోతైన అధ్యయనం చేశారు. ‘ముఖ్యంగా మన దేశం నుంచి వచ్చే మహిళలకు అక్కడి కోర్టులు, చట్టాల గురించి పెద్దగా అవగాహన లేదు. స్థానిక మహిళలకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. పిల్లలు లైంగిక దాడులకు గురయ్యేవారు. ఇదంతా విన్నాక నేను లా ఎందుకు చదవకూడదు అనుకున్నాను. అందుకే శాంటా క్లారా యూనివర్సిటీలో లా డిగ్రీలో చేరాను’ అంటూ ఆమె పంచుకున్నారు.
కుటుంబ సహకారంతోనే…
‘నా భర్త ప్రవీణ్ అప్పట్లో ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజనీర్. లా చేస్తున్నప్పుడే పాప పుట్టింది. దాంతో కాలిఫోర్నియా బార్ పరీక్షలకు సిద్ధం కావడం కష్టంగా అనిపించింది. అందుకే పాపను ఇండియా తీసుకెళ్ళి అమ్మ దగ్గర వదిలిపెట్టి పరీక్షలు రాశాను. పరీక్ష ముగిసిన వెంటనే పాపను తీసుకొచ్చారు. రిజల్ట్ రోజు చాలా టెన్షన్ పడ్డాను. పాపను ఒడిలో పెట్టుకొని ల్యాప్‌టాప్ తెరిచాను. బార్ కౌన్సిల్ రిజిస్టర్‌లో నా పేరు చూడగానే రిలాక్స్ అయ్యాను. కుటుంబ సహకారంతోనే ఇది సాధ్యమయింది’ అంటూ ఆమె పంచుకున్నారు. జయ 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేసి పదేండ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. యూఎఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రయిల్ అడ్వకసీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా వ్యవహరించారు. మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగా కూడా పని చేశారు.
మన జీవితం తెరచిన పుస్తకం
అమెరికాలో న్యాయమూర్తులను ఎంపిక చేసే విధానం గురించి మాట్లాడుతూ ‘ఇది చాలా కష్టం. నేను 2021లో దరఖాస్తు చేసుకున్నాను. ఫలితాలు ఇప్పుడు వెలువడ్డాయి. దరఖాస్తు పూర్తి చేయడానికి రెండు నుండి మూడు నెలలు పడుతుంది. మన హాబీలతో మొదలుపెట్టి మన స్కూల్, కాలేజీ రోజుల గురించి రాయాలి. లాయర్‌గా మీరు ఎలాంటి కేసులు డీల్ చేశారు? చేసిన కేసుల్లో కనీసం 75 గురించి అందులో ప్రస్తావించాలి. దరఖాస్తు పూర్తయ్యే సరికి మన జీవితం తెరిచిన పుస్తకంలా అనిపిస్తుంది. ఆ వివరాలన్నీ తనిఖీ చేసి, నామినేట్ చేసే న్యాయ కమిటీకి పంపుతారు. తర్వాత మరో బృందం పరిశీలన చేస్తుంది. మేం పేర్కొన్న 75 మందితో పాటు మొత్తం 250 మందిని విచారిస్తారు. ఆ తర్వాత ఇంటర్య్యూ. వారిలో ఎవరైనా ఏదైనా నెగిటివ్‌గా చెబితే ఇంటర్వ్యూలో దాని గురించి అడుగుతారు. వారు ఒప్పుకున్న తర్వాత గవర్నర్‌కు పంపుతారు. అవసరమైతే మరో ఇంటర్వ్యూ’ అంటూ వివరించారు.
ఫ్యామిలీ లా నిపుణురాలిగా
2018లో కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని అత్యవసర సేవల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే 2020లో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లో అటార్నీగా కూడా పనిచేశారు. 2022 నుంచి శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్‌గా వ్యవహరిస్తూ కాలిఫోర్నియాలో ఫ్యామిలీ లా నిపుణురాలిగా మంచి గుర్తింపు పొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగానూ వ్యవహరించారు. అయితే శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జి రాబర్ట్ లాఫమ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో జయ జడ్జిగా నియమితులయ్యారు. ఇప్పటికే.. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మన తెలుగు ప్రజలు కీలకమైన పదవులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి సరసన జయ కూడా చేరారు.
తెలుగు వెలుగును చాటారు
శాంక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన తర్వాత ఆమె తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి తెలుగు వెలుగును చాటారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె తెలుగులో మాట్లాడడం అందరినీ ఆకర్షించింది. తన మాతృభాష తెలుగు మీద తనకున్న అభిమానాన్ని తాను ఇలా చాటాకున్నాని చెప్పారు. ప్రమాణ స్వీకార ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆమె ‘గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవరీవన్… మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం’ అన్నారు. ఈ గొప్ప సందర్భంలో తన మాతృభాషలో మాట్లాడ్డం తనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం అని భావోద్వేగంతో చెప్పారు. ఇలాంటి సందర్భాలలో తెలుగును మాట్లాడ్డం మొదటిసారి అంటూ తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ సంస్కృత శ్లోకాన్ని కూడా అక్కడి వారికి వినిపించారు. అమెరికాలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా అక్కడ తెలుగు వెలుగును ప్రసరింపజేసిన జయను తెలుగు ప్రజలు, ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
వృత్తి జీవితంలో సవాళ్లు
‘సమాజంలో ప్రతి చోట లింగ వివక్షతో సహా అనేక సవాళ్లు ఉన్నాయి. లాయర్‌గా తొలినాళ్లలో నాకు అమెరికన్ ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. అక్కడి వారంతా నన్ను ఆటపట్టించేవారు. దీంతో మరింత పట్టుదలతో పని చేయడం ప్రారంభించాను. నన్ను నేను నిరూపించుకున్నాను. సామాన్యులు కోర్టు ఖర్చులు భరించలేరు. అంతేకాదు విడాకుల కేసుల్లో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే వీలైనంత వరకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేసేదాన్ని. ప్రజలకు నిజమైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ జయ వివరించారు.
పిల్లల పెంపకం
‘వాస్తవానికి ఉద్యోగ బాధ్యతలు, పిల్లల పెంపకం సమతుల్యం చేయడం చాలా పెద్దపని. మొదట్లో అమ్మ, అమ్మమ్మ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. స్వతంత్య్రంగా బతకగలరు. అయితే ఇక్కడి బాలల చట్టాలపై మన తెలుగు వారికి అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. మా పిల్లలకు కూడా మన తెలుగు సంప్రదాయాలు నేర్పుతుంటాను. ఒక తల్లిగా వారి అవసరాలన్నింటినీ చూసుకుంటాను. ఏ స్థాయిలో ఉన్నా కుటుంబ జీవితంలోనే నిజమైన ఆనందం లభిస్తుంది’ అంటున్నారు జయ.