తండ్రి, సోదరుడు రాజకీయాల్లోనే హత్యలకు గురయ్యారు. ఆమెపై కూడా 20 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇసుమంతైనా జంకకుండా రాజకీయాల్లో ఉండేందుకే నిర్ణయించుకుంది. ఎంతో ధైర్యంగా తన రాజకీయ జీవితం కొనసాగించింది. అంతేనే ఎన్నికల్లో నిలబడి గెలిచింది. ఇటీవలెనే జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు. తన కేబినెట్‌లో ఒకే ఒక మహిళకు అవకాశం కల్పించారు. ఆమెనే సకీనా ఈటూ. ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రి అయిన ఆమె స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…
రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన సకీనా ఈటూ.. తండ్రి, సోదరుడు కూడా రాజకీయాల్లో ఉండేవారు. అయితే వారిద్దరినీ ఉగ్రవాదులు చంపేశారు. పైగా సకీనా ఈటూ కూడా 20 సార్లు హత్యాయత్నాల నుంచి బయటపడ్డారు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన సకీనా… తాజాగా మరోసారి ఒమర్ అబ్దుల్లా కేబినెట్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక మహిళగా నిలిచారు.
తండ్రీ, సోదరుడిని పోగొట్టుకున్నా…
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా డీహెజ్ పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సకీనా ఈటూ ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గుల్జార్ అహ్మద్ దర్‌పై 17,449 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సకీనా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. ఆమె తండ్రి వలీ మోహమ్మద్ ఈటూ.. గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఆయన 1994లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె సోదరుడు రాజకీయాల్లోకి వచ్చాడు. అతడిని కూడా 2001లో ఉగ్రవాదులు హత్య చేశారు.
పలు బాధ్యతల్లో…
సోదరుడు చనిపోయిన సమయంలో సకీనా మెడిసిన్ చదువుతుంది. తండ్రీ, సోదరుడుని పోగొట్టుకున్నా ఏ మాత్రం భయపడకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈమె రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత 20 సార్లకు పైగా హత్యాయత్నాలు జరిగినా ప్రాణాలతో ఆమె బయటపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా పర్యాటక శాఖ, విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు జమ్మూ కాశ్మీర్ సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్నారు. 53 ఏండ్ల సకీనా తాజాగా ఒమర్ అబ్దుల్లా కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న అతి కొద్దిమంది మహిళా నేతల్లో సకీనా ఈటూ ఒకరు.