ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి

Adialabad,Navatelangana,Telugu News,Telangana.– సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌
– ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ప్రభుత్వం ఎన్నికల్లో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించి, అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. వారికి నిర్వహించ తలపెట్టిన పరీక్షలు రద్దు చేయాలన్నారు. స్థిర వేతనం రూ.18000 అమలు చేయాలన్నారు. పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్య పరిష్కారంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. రోజువారి పనులు కాకుండా అదనపు పనులు కేటాయించినప్పుడు అదనపు మొత్తాలు చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం నాయకులు లక్ష్మీ, నవీన, భారతి, దేవి, పద్మ, పార్వతి, రూప, రేణుక పాల్గొన్నారు.