– రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ-విలేకరులు
ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేసి, కనీస వేతనం ఇవ్వాలని, రెండేండ్ల లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్ల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట బుధవారం ధర్నాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏఎన్‌సీ, బీపీ టెస్టు టార్గెట్ పెట్టకూడదని, స్పూటమ్ డబ్బాలు తేవాలని ఒత్తిడి చేయడం సరికాదని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని, పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని కోరారు.
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆశావర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంఅండ్‌హెచ్‌ఓ హరీష్‌రాజ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ సీతారాం నాయక్‌కు వినతిపత్రం అందించారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఖమ్మంలో ఆశా కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌లోకి వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టరేట్ గేట్ ఎదుట బైటాయించి సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఆయన స్పందిస్తూ.. కొద్దిగా డబ్బులు వచ్చాయని, చెల్లిస్తామని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి డీఎంహెచ్‌ఓకు ఫోన్ చేసి పెండింగ్ సర్వేల డబ్బులు వారం రోజుల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకొని ధర్నా చేపట్టారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి డీఎంహెచ్‌ఓ మురళీధర్‌కు వినతిపత్రం అందజేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు.