– రాష్ట్రావ్యాప్తంగా ధర్నాలు
– కలెక్టర్లకు వినతి
నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు డిసెంబర్, జనవరి నెలల పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. గతంలో ప్రతి నెలా 2వ తేదీన పారితోషికాలు అకౌంట్లో పడేవి, ఇప్పుడు నేటికీ పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పారితోషికాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అప్పారావు మాట్లాడారు. ఆశా వర్కర్లంతా మహిళలు, బడుగు, బలహీన తరగతులకు చెందిన వారని, వారికి కనీస వేతనం లేదని అప్పు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారని అన్నారు. కనీసం ఫిక్స్‌డ్ వేతనం కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్నవి చాలీచాలని, అతి తక్కువ పారితోషికాలు కూడా సకాలంలో రాకపోవడంతో ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. అనంతరం ఆయా కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చెపట్టి, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పాటీల్‌కు వినతిపత్రం అందజేశారు.