ఫిబ్రవరి నెలలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తల కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా కార్యకర్తలు కిలోమీటర్ల పాదయాత్రతో పాటు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కలెక్టరేట్ కు చేరుకుంది. ధర్నా నిర్వహించి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న మాట్లాడుతూ.. ఎన్నికలకంటే ముందు ఇన్చార్జి మంత్రి సీతక్క అనేక హామీలు ఇచ్చి మంత్రి అయిన తరువాత విస్మరించారని ఆరోపించారు. కేరళ రాష్ట్ర తరహాలో ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ భద్రతతో పాటు రెగ్యులర్ చేయాలని, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వాలని, పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటిపై ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ కుమార్, ఆశా కార్యకర్తలు నైతం శోభ, సుజాత, లక్ష్మీ, మాధవి, స్వప్న, సురేఖ, మమత, ఆశా పాల్గొన్నారు.