వసతి గృహంలోనే ఆశ్రమ పాఠశాల..

– పాఠశాల మంజూరు చేసారు
– పోస్ట్ లు మరిచారు
నవతెలంగాణ – అశ్వారావుపేట : గృహం అయినా,బడి అయినా కనీస మౌళిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాతే దానికో రూపు వస్తుంది.అందులో ఉండటానికి సౌకర్యవంతంగా ఉంటుంది.ఈ విధానం ఎపుడైనా,ఎక్కడైనా సాదారణ విషయం. కానీ ప్రభుత్వం పాఠశాల మంజూరు చేస్తే ఉపాద్యాయ పోస్ట్ లు మంజూరు చేయరు.పాఠశాల ఏర్పాటు చేసినా అరకొర వసతులు తో విద్యార్ధులు కాలం వెల్ల తీయాల్సిందే. ఇదీ మన ప్రభుత్వ నేటి  విద్యారంగం దీనావస్థ. శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో గల ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేసారు.వసతులు పై ఆరా తీసారు. గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఐటీడీఏ పర్యవేక్షణలో నిర్వహించే గిరిజన బాలికల వసతి గృహం ను 2013 లో కన్వర్టెడ్ స్కూల్ మార్చి నాటి ఎమ్మెల్యే మిత్ర సేన ప్రారంభించారు.ప్రారంభంలో 3 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు నిర్వహించిన ఆశ్రమ పాఠశాల 2022 – 23 వరకు 9 వ తరగతి వరకు విస్తరించింది.2023 – 24 లో పూర్తి స్థాయిలో ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గా రూపాంతరం చెంది 10 వ తరగతి ప్రధమ బ్యాచ్ పరీక్షలు రాసారు. అయితే ఇప్పటి వరకు ఈ పాఠశాలకు కావాల్సిన ఉపాద్యాయ పోస్ట్ లను మాత్రం గిరిజన విద్యాశాఖ మంజూరీ చేయలేదు.దీంతో ప్రస్తుతానికి నలుగురు రెగ్యులర్ ఉపాద్యాయులు డిప్యూటేషన్ పై,మరో ఆరుగురు కాంట్రాక్టర్ టీచర్ లు ఈ పాఠశాలలో బోధన చేస్తున్నారు.ఈ పాఠశాల లో 3 నుండి 10 వ తరగతి వరకు 8 తరగతుల్లో ఈ ఏడాది మొత్తం 178 మంది విద్యార్ధినులు వసతి పొందుతూ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల లో 8 తరగతి గదులు తో పాటు లైబ్రరీ,ల్యాబ్,కార్యాలయం,సిబ్బంది కోసం మరో నాలు గదులు మొత్తం 12 గదులు అవసరం.ప్రస్తుతం 9 గదుల్లో నే సర్దుకుంటున్నారు. హెచ్.ఎం తో పాటు బోధనా సిబ్బంది కి క్వార్టర్స్ అవసరం ఉంది. ఇప్పటికైనా అదనపు గదులు నిర్మించి,ఉపాద్యాయ పోస్ట్ లు మంజూరు చేయాలని,సిబ్బంది వసతి కోసం క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలని విద్యార్ధిని లు,ఉపాద్యాయులు కోరుతున్నారు.