విష జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

– రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
– ఆదివాసీ విద్యార్థి సంఘం డిమాండ్‌
నవతెలంగాణ-ఏటూరునాగారం(ఐటీడీఏ)
ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కన్నాయిగూడెం మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన కోరం చరణ్‌.. ములుగు మండలం ఇంచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కాగా విద్యార్థి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా.. పట్టించుకోని పాఠశాల నిర్వాహకులు.. ఆలస్యంగా విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే విద్యార్థిని హాస్పిటల్‌కి తీసుకెళుతుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. దాంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంతోనే విద్యార్థి చనిపోయాడని విద్యార్థి సంఘం జిల్లా నాయకులు దబ్బకట్ల శ్రీకాంత్‌ తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని ఏమాత్రం పట్టించుకోకుండా ఉపాధ్యాయులు వారి ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఐడీడీఏ పీఓ విధుల్లో చేరి ఎనిమిది నెలలు కావస్తున్నా పాఠశాల స్థితిగతులపై ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పీఓ స్పందించి నిర్లక్ష్యపు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకొని, ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.