– పండ్ల తోటలకు అనువైన నేలలు
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉద్యాన పంటల కు అశ్వారావుపేట ప్రాంతం అనువైనది అయినందున భవిష్యత్ లో ఉద్యాన హబ్ గా మారుతుందని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాంతం నేలలు ఉద్యాన పంటలకు అనుకూలమని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారని తెలిపారు. స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ను సోమవారం ఆయన పరిశీలించారు.అనంతరం విలేకరుల తో మాట్లాడుతూ రైతు ఆర్థికం గా నిలబడాలంటే ఒకే వ్యవసాయ క్షేత్రంలో మూడు,నాలుగు రకాల పంటలను సాగు చేయాలని సూచించారు.ఒక పంట వల్ల నష్టం వాటిల్లినా ఇతర పంటల ద్వారా ఆర్థిక భరోసా కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఆయిల్ ఫాం, కొబ్బరి, జీడీ వంటి ఉద్యాన పంటలతో పాటు కూరగాయల సాగు అత్యధికంగా సాగవుతుందని వివరించారు.ఉద్యాన తోటల్లో అంతర పంటలు సాగు రైతుకు ఎంతో మేలు కలిగిస్తుందని అన్నారు. కోకో, వక్క, జాజీ వంటి అంతర పంటల సాగు వైపు రైతులు ఆశక్తి చూపుటం శుభ పరిణామమని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్క జిల్లా, రాష్ట్రంలో కూడా ఆయా ప్రాంతాల రైతులు ఒక భూమి లో అనేక రకాల ఉద్యాన పంటలను సాగు చేసుకుంటున్నారని, మన రైతులు సైతం అందుకు మిన్నగా అంతర పంటలను సాగు చేసుకోవాలన్నదే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. పామాయిల్, కొబ్బరి తోటల్లో అనుకూలమైన అంతర పంటలను గుర్తించి రైతులను ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని చెప్పారు. అందుకు ప్రభుత్వం నుండి రైతులకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. పాత సత్తుపల్లి నియోజకవర్గం ఇచ్చిన రాజకీయ జీవితాన్ని ప్రజలు, రైతులు, వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, సంక్షేమానికి సద్వినియోగం చేసుకుంటానని ప్రకటించారు. తాను ఏ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినా రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చానని అన్నారు. నాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పామాయిల్ మొక్క నాటి సాగును ప్రోత్సాహించారని, నేడు సిరులు కురిపిస్తుందని చెప్పారు. ఇతర జిల్లాల రైతులు పామాయిల్ సాగుపై అవగాహన, అద్యయనం కోసం అశ్వారావుపేట వచ్చి పర్యటిస్తున్నారని, లాభనష్టాలను బేరీజు వేసుకుని పామాయిల్ సాగు పట్ల ఆశక్తి చూపుతున్నారని, రాష్ట్రంలో ఆయిల్పాం సాగుకే బంగారు భవిష్యత్ ఉంటుందని భరోసానిచ్చారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.30 కోట్లతో పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయిల్ఫెడ్ ఏడాదికి రూ.2.50 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని, ఈ ఆర్థిక భారం రైతుపై పడకుండా సాంతంగా పామాయిల్ ముడి సరుకుతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ సామార్థ్యం గంటకు 60 మెట్రిక్ టన్నులు ఉందని, రానున్న కాలంలో మరో 5 ఉండి 10 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చినా మరో 30 టన్నుల సామార్థ్యం నిర్మించుకున్న విద్యుత్ సమస్య లేకుండా ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ప్లాంట్ ను నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తే రైతులకు, ఆయిల్ఫెడ్ సంస్థకు మేలు కలుగుతుందని అధికారులను ఆదేశించానని అన్నారు. మంత్రి వెంట ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి, డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ,అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీ ల మేనేజర్ లు ఎం.నాగబాబు,కళ్యాణ్ గౌడ్ ,మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,రైతు నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, రామచంద్ర ప్రసాద్, బండి భాస్కర్, బత్తిన పార్థసారధి, నార్లపాటి రాములు, కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ చౌదరి, పాలవలస జీవన్రావు,నార్లపాటి మహేష్ తదితరులు ఉన్నారు.