– 515 ఛేదనలో బంగ్లాదేశ్ చతికిల
– 280 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు గెలుపు
– 1-0తో టెస్టు సిరీస్‌లో భారత్ ఆధిక్యం
చెపాక్‌లో అశ్విన్ మాయజాలం. తొలుత బ్యాట్‌తో శతక మ్యాజిక్‌తో బంగ్లాదేశ్‌ను దంచికొట్టిన చెన్నై చిన్నోడు.. ఆఖర్లో బంతితో బంగ్లాదేశ్‌ను గిర్రున తిప్పేశాడు. అశ్విన్ ఆరు వికెట్ల మాయజాలానికి రవీంద్రజాలం తోడవటంతో 515 పరుగుల రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. 234 పరుగులకే ఆలౌటై తొలి టెస్టులో పరాజయం పాలైంది.
తొలి టెస్టులో టీమ్ ఇండియా దుమ్మురేపింది. బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ప్రదర్శన చేసింది. తొలి రోజు ఉదయం సెషన్లో కాస్త తడబాటుకు గురైనా.. ఆ తర్వాత రోహిత్‌సేనకు ఎక్కడా బ్రేక్ పడలేదు. సీమర్లు, స్పిన్నర్లు వికెట్ల వేటలో పోటీపడటంతో బంగ్లాదేశ్ తేలిపోయింది. 280 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు శుక్రవారం నుంచి కాన్పూర్‌లో జరుగనుంది.
నవతెలంగాణ-చెన్నై
తొలి టెస్టులో టీమ్ ఇండియా అలవోక విజయం సాధించింది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (113, 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) (6/88) బ్యాట్‌తో, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. నాల్గో రోజు ఆటలో స్పిన్ మాయజాలం సృష్టించిన అశ్విన్.. బంగ్లాదేశ్ కథ ముగించాడు. రవీంద్ర జడేజా (3/58) సైతం మ్యాజిక్‌లో జత కలవటంతో 515 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి 62.1 ఓవర్లలోనే బంగ్లాదేశ్ చతికిల పడింది. 280 పరుగుల భారీ తేడాతో భారత్ తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (82, 127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. లోకల్ స్టార్ రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సొంతం చేసుకుంది. భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆరంభం కానుంది.
తొలి సెషన్లోనే..
ఓవర్‌నైట్ స్కోరు 158/4తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ఉదయం సెషన్లోనే చేతులెత్తేసింది. 25 ఓవర్లలోనే బంగ్లా పులుల కథ ముగిసింది. నిజానికి తొలి గంట ఆటలో బంగ్లాదేశ్ గొప్పగా ప్రతిఘటించింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (82), షకిబ్ అల్ హసన్ (25) ఆచితూచి ఆడారు. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌లు కట్టుదిట్టంగా బంతులేసినా.. వికెట్ లభించలేదు. ఉదయం సెషన్లో పేస్‌కు వికెట్ దక్కలేదు, దీంతో బంగ్లాదేశ్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ బంతి అశ్విన్ చేతికి అందిన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. పేసర్లు వికెట్ల వేటలో చెమటోడ్చిన పిచ్‌పై అశ్విన్ ఆడుతూ పాడుతూ వికెట్ల జాతర సాగించాడు. బంగ్లా బ్యాటర్లు ఎదురుదాడి చేయాలనే ప్రణాళికలో వికెట్లు కోల్పోయారు. బంగ్లాదేశ్ ఆఖరు ఆరు వికెట్లను 40 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ప్రమాదకర షకిబ్ అల్ హసన్‌ను తన తొలి ఓవర్లోనే అవుట్ చేసిన అశ్విన్.. మెహిది హసన్ మిరాజ్ (8), టస్కిన్ అహ్మద్ (5)లను సాగనంపాడు. అర్థ సెంచరీతో విసిగించిన నజ్ముల్ సహా ఫామ్‌లో ఉన్న లిటన్ దాస్ (1), హసన్ మహ్మద్ (7)లను జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 62.1 ఓవర్లలోనే బంగ్లాదేశ్ 234 పరుగులకు కుప్పకూలింది. భారత్ 280 పరుగుల భారీ తేడాతో అలవోక విజయం నమోదు చేసింది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓ టెస్టులో శతకం సహా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు నెలకొల్పాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 376/10
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 149/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 287/4 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : జాకిర్ హసన్ (సి) జైస్వాల్ (బి) బుమ్రా 33, షాద్‌మాన్ ఇస్లామ్ (సి) గిల్ (బి) అశ్విన్ 35, నజ్ముల్ శాంటో (సి) బుమ్రా (బి) జడేజా 82, మోమినుల్ హాక్ (బి) అశ్విన్ 13, ముష్ఫీకర్ రహీమ్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 13, షకిబ్ అల్ హసన్ (సి) జైస్వాల్ (బి) అశ్విన్ 25, లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) జడేజా 1, మెహిది హసన్ మిరాజ్ (సి) జడేజా (బి) అశ్విన్ 8, టస్కిన్ అహ్మద్ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 5, హసన్ మహ్మద్ (బి) జడేజా 7, నహిద్ రానా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (62.1 ఓవర్లలో ఆలౌట్) 234.
వికెట్ల పతనం : 1-62, 2-86, 3-124, 4-146, 5-194, 6-205, 7-222, 8-222, 9-228, 10-234.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 10-2-24-1, మహ్మద్ సిరాజ్ 10-5-32-0, ఆకాశ్ దీప్ 6-0-20-0, రవిచంద్రన్ అశ్విన్ 21-0-88-6, రవీంద్ర జడేజా 15.1-2-58-3.
తొలి టెస్టు పాస్!
స్వదేశీ టెస్టు సీజన్‌లో టీమ్ ఇండియా తొలి సవాల్‌ను విజయవంతంగా ఎదుర్కొంది. ప్రత్యర్థి బంగ్లాదేశ్.. పాకిస్థాన్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి ఇక్కడికి వచ్చింది. ఉపఖండ పిచ్‌ల పరిస్థితులు బంగ్లాదేశ్‌కు కొత్త కాదు. దీనికి తోడు ఆ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లకు కొదవ లేదు. ఇదే సమయంలో మన బ్యాటర్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో గౌతం గంభీర్ చీఫ్ కోచ్‌గా చెపాక్‌లో తొలి టెస్టు సవాల్‌లో పాస్ అయ్యాడు. 280 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించినా.. ఇది అంత తేలిగ్గా దక్కిన గెలుపు కాదు. ఎర్రమట్టి పిచ్‌పై పదునైన పేస్ ముంగిట తొలి రోజు ఆరంభంలోనే భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్, గిల్, విరాట్ అవుటవగా.. 34/3తో భారత్ కష్టాల్లో పడింది. 144/6తో 200 పరుగుల లోపే ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది. అశ్విన్, జడేజా ఏడో వికెట్‌కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి జట్టును నిలబెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రోహిత్, జైస్వాల్, విరాట్ త్వరగా అవుటయ్యారు. 67/3తో ఉండగా.. రిషబ్ పంత్, గిల్‌లు సెంచరీలతో చెలరేగారు. బ్యాటింగ్ పరంగా కీలక ఆటగాళ్లు నిరాశపరిచినా.. యువ బ్యాటర్లు కదం తొక్కారు. బంతితోనూ భారత్ ప్రదర్శన అమోఘం. పేస్‌కు అనుకూలత లభించిన వేళ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ వికెట్ల వేట సాగించగా.. పిచ్ నుంచి టర్న్ రాగానే స్పిన్నర్లు అశ్విన్, జడేజా మాయజాలం మొదలెట్టారు. ఒకరికద్దరు ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి విజయాలు సాధించలేమని గంభీర్ బలంగా విశ్వసిస్తాడు. అతడి శిక్షణ సారథ్యంలో తొలి టెస్టులోనే సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించటం భారత క్రికెట్‌కు సానుకూల సంకేతం.