జనరల్‌ కోచ్‌ల పెంపుదలకు ప్రత్యేక డ్రైవ్‌ : అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ: రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు కేంద్ర రైల్వేశాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇప్పటికే 2,500 జనరల్‌ కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10 వేల కోచ్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మరో 50 అమృత్‌ భారత్‌ రైళ్ల తయారీని ప్రారంభించామన్నారు. గతేడాది డిసెంబర్‌లో మాల్దా, దర్బాంగా నుంచి ప్రధాని మోడీ రెండు అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఇవేకాక మరో 150 అమృత్‌భారత్‌ రైళ్ల తయారీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గతేడాది 5,300 కొత్త రైల్వే ట్రాక్‌లను జోడిస్తామని, ఈ ఏడాది కూడా 800 కిలోమీటర్ల పైగా ట్రాక్‌లను జోడిస్తామని రైల్వే మంత్రి తెలిపారు. కవాచ్‌ సిస్టమ్‌ అమలు చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు.