మోంగ్‌కోక్ (హాంగ్‌కాంగ్) : ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. బుధవారం జరిగిన టైటిల్ పోరులో బంగ్లాదేశ్‌పై 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్-ఏ (అండర్-23) చాంపియన్‌గా అవతరించింది.ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. దినేశ్ వృంద (36, 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కనిక అహుజ (30, 23 బంతుల్లో 4 ఫోర్లు) సహా యు ఛెత్రి (22, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తెలంగాణ స్టార్ గొంగడి త్రిష (4) మిడిల్ ఆర్డర్‌లో అంచనాలు అందుకోలేదు. ఇక సవాల్‌తో కూడుకున్న ఛేదనలో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలోనే కుప్పకూలింది. స్పిన్ ద్వయం శ్రేయాంక పాటిల్ (4/13), మన్నత్ కశ్యప్ (3/20) మ్యాజిక్‌తో మెరిశారు. బంగ్లా-ఏ తరఫున నహిద అక్తర్ (17), శోభన (16) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. 96 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్-ఏ 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత క్రికెటర్లు కనిక అహుజ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. శ్రేయాంక పాటిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకుంది.