– అట్టహాసంగా ఆరంభ వేడుకలు
– 19వ ఆసియా క్రీడలు ఆరంభం
– చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
నవతెలంగాణ-హౌంగ్జౌ
కండ్లుచెదిరే లైట్ షో, కృత్తిమ మేధతో కూడిన ప్రదర్శనలు, డిజిటల్ ఇగ్నీషన్, చైనా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలకు తోడు ఆసియా దేశాల భవిష్యత్ మార్గనిర్దేశనంగా సాగిన ఆసియా క్రీడల ఆరంభ వేడుకలు హౌంగ్జౌ ఒలింపిక్ సెంటర్‌ను ఊపేసింది. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అధికారికంగా 19వ ఆసియా క్రీడలు ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు. సుమారు లక్ష మంది అభిమానులు ఆరంభ వేడుకలకు హౌంగ్జౌ ఒలింపిక్ సెంటర్ స్టేడియంకు ముంచెత్తగా.. 10 కోట్ల మంది అభిమానులు డిజిటల్ ఇగ్నిషన్ సెర్మానీలో పాలు పంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. 19వ ఆసియా క్రీడలు వాస్తవానికి 2022, సెప్టెంబర్ 10-25న జరగాలి. కరోనా మహమ్మారి పరిస్థితుల ప్రభావంతో క్రీడలను ఏడాది పాటు వాయిదా వేశారు. ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వటం చైనాకు ఇది ముచ్చటగా మూడోసారి. 1990లో బీజింగ్, 2010లో గాంగ్జౌ నగరాలు ప్రతిష్టాత్మక కాంటినెంటల్ క్రీడా ఈవెంట్‌కు వేదికగా నిలిచాయి. హౌంగ్జౌ నగరం ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న మూడో చైనా నగరం కావటం విశేషం. 45 దేశాల నుంచి 12500 మందికిపై అథ్లెట్లు పోటీపడుతున్న ఈ కాంటినెంటల్ క్రీడా సంగ్రామం నిర్వహణకు చైనా ప్రభుత్వం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసింది.
అద్భుతం.. అద్వితీయం
19వ ఆసియా క్రీడల ఆరంభ వేడుకలు అద్భుతం, అద్వితీయం అన్నట్టుగా సాగాయి. సంప్రదాయానికి ఆధునికత జోడించి అభిమానులకు మరుపురాని అనుభూతిని మిగిల్చారు. బీజింగ్ 2020 వింటర్ ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలను పర్యవేక్షించిన క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్లే ఇప్పుడు హౌంగ్జౌ ఆసియా క్రీడల ఆరంభ వేడుకలను డిజైన్ చేశారు. చైనా సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబించిన నృత్య ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకోగా.. స్టేడియం, హౌంగ్జౌ నగర వ్యాప్తంగా ప్రదర్శించిన లేజర్ లైట్ షో ఆసియా క్రీడల ఆరంభ వేడుకలకే హైలైట్‌గా నిలిచింది. ఆసియా దేశాల ఐక్యత, భవిత చాటేలా ఆరంభ వేడుకలను రూపుదిద్దటం ఆకట్టుకుంది.
భారతీయం
ఆరంభ వేడుకల్లో భారతీయత ఉట్టిపడింది. భారత మెన్స్ హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ లవ్లీనా బొర్గొహైన్‌లు ఆరంభ వేడుకల పరేడ్‌లో భారత పతకాధారులుగా వ్యవహరించారు. హర్మన్‌ప్రీత్ సింగ్, లవ్లీనా బొర్గొహైన్ మువ్వెన్నల జెండాతో ముందు నడువగా.. సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో టీమ్ ఇండియా అథ్లెట్లు పరేడ్‌లో పాల్గొన్నారు. భారత బృందం స్టేడియంలోకి అడుగుపెట్టగానే అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ఆతిథ్య చైనా అతిపెద్ద జట్టును ఆసియా క్రీడల బరిలో నిలుపగా.. తాలిబన్ల పాలనలోని అఫ్ఘనిస్థాన్ మహిళా అథ్లెట్లు లేని మెన్స్ బృందాన్ని మాత్రమే ఆసియా క్రీడలకు పంపించింది.
అభిమానులకూ ‘గిఫ్ట్’!
ఆసియా క్రీడల ఆరంభ వేడుకలు అభిమానులకు మరింత మధురంగా నిలిచేందుకు నిర్వాహకులు చక్కటి ఆలోచనతో ముందుకొచ్చారు. హౌంగ్జౌ ఒలింపిక్ సెంటర్ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలకు సుమారు లక్ష మంది అభిమానులు హాజరయ్యారు. ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానులకు నిర్వాహకులు ‘గిఫ్ట్’ను అందజేశారు. వాటర్ బాటిల్, స్నాక్స్, టవల్, క్రీడల షెడ్యూల్, క్లీనింగ్ వైప్స్, ఓ జ్ఞాపికతో కూడిన బ్యాగ్‌ను అందించారు.