పాక్‌ అధ్యక్షుడిగా అసిఫ్‌ అలీ జర్దారీ ప్రమాణస్వీకారం

Asif Ali Zardari sworn in as President of Pakistanఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా అసిఫ్‌ అలీ జర్దారీ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. 68 ఏళ్ల జర్దారీ చేత పాక్‌ అధ్యక్ష భవనం ఐవాన్‌-ఎ-సదర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫేజ్‌ ఇసా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌, త్రివిధ దళాధిపతులు, సీనియర్‌ అధికారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో పిటిఐ మద్దతుగల సున్నీ ఇత్త్తెహాద్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసి) అభ్యర్థి మహమూద్‌ ఖాన్‌ అచక్జైపై పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) కో-చైర్మన్‌, అధికార కూటమి ఉమ్మడి అభ్యర్థి జర్ధారీ ఘన విజయం సాధించారు. జర్దారీకి 411 ఎలక్ట్రోరల్‌ ఓట్లు రాగా, మహమూద్‌ ఖాన్‌కు కేవలం 181 ఓట్లు మాత్రమే వచ్చాయి. పాక్‌ అధ్యక్షుడిగా జర్దారీ ఎన్నిక కావడం ఇది రెండోసారి. గతంలో 2008 నుంచి 2013 వరకూ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించారు. పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో భర్తే జర్దారీ.