కాలగర్భంలో మరో ఏడాది గడిచి రెండ్రోజులైంది. నూతన ఆశలు, ఆకాంక్షలతో కొంగొత్త ఏడాది మన జీవితాల్లోకి వచ్చి చేరింది. ఇలా సంవత్సరాలు వస్తున్నాయి.. పోతున్నాయి. ఈ క్రమంలో మన జీవితాల్లో ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలు, శ్రామికులు, కర్షకుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయా? అనే అంశాన్ని లోతుగా పరిశీలించాలి. పరిష్కార మార్గాలూ వెతకాలి. ఏదైనా ఒకపని చేసినప్పుడు అది మంచిదా? చెడ్డదా? అనే తూకం వేయాల్సి వచ్చినప్పుడు…అది ఎక్కువమందికి ప్రయోజనం చేకూర్చితేనే మంచిదని చెబు తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయిన క్రమంలో…అలా చూస్తే గనుక కచ్చితంగా ప్రభుత్వం తన విద్యుక్త ధర్మాన్ని పాటించలేదని చెప్పక తప్పదు. హైదరాబాద్ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌ను ఒక్కసారి అడిగి చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం తాజాగా అక్కడ పిడికెళ్లెత్తారు. రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఇతర హామీలపై ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల పట్ల కాంగ్రెస్ ఇప్పుడు కిమ్మనకపోవటం ఆ పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.
తెలంగాణలో కోటిమంది దాకా ఉన్న కార్మికుల కనీస వేతనాలపై గత సర్కార్ నోరు మెదపక పోవటం దాని బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. అయితే.. అదే అలసత్వం ఇప్పుడూ కొనసాగటం కాంగ్రెస్ కార్మిక వ్యతిరేక విధా నాలకు ప్రబల సాక్ష్యం. మరోవైపు నూతన రేట్ల ఒప్పందాలను అమలు చేయకుండా సివిల్ సప్లయిస్, జీసీసీ కార్మి కులను సమ్మెలోకి నెట్టటాన్ని తప్పుబట్టకుండా ఉండలేం. వేతనాల పెంపు, బకాయి వేతనాల విడుదల, పర్మినెంట్ కోసం రాష్ట్రంలోని పంచాయతీ సిబ్బందికి… సర్కారుకు మధ్య ‘పంచాయితీ’ కొనసాగుతోంది. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, సిబ్బంది ‘మా సమస్యలను పరిష్కరించండి మహాప్రభో…’ అంటూ ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టు కుంటున్నా ఫలితం శూన్యం.ఇలా చెప్పుకుంటూపోతే కార్మికులు, కష్టజీవుల సమస్యలు రాష్ట్రంలో ఎన్నో..ఎన్నెన్నో.
గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, దాని తప్పులకు సంబంధించి శ్వేతపత్రాల మీద పత్రాలు విడుదల చేసిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం…వాటి పేరిట ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా నాన బెడుతోందనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి.’బీఆర్‌ఎస్ చేసిన అప్పుల గురించి ఎన్నికల సమయంలో, హామీలిచ్చే ముందు తెలి యదా?’ అనే వ్యంగ్యాస్త్రాలనూ ప్రభుత్వం తట్టుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా రైతులను ఆదుకునే రైతు భరోసా, మహిళలు, వ్యవసాయ కార్మికులకు చేయూతనిచ్చే ఆర్థిక సాయాలు, అవ్వాతాతలు ఆత్మగౌరవంతో బతికేలా చేసే పింఛన్ల పెంపు తదితరాంశాల్లో సర్కారు మొద్దునిద్రను వీడి సత్వరమే చర్యలు గైకొనాలి.
ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తీసుకొచ్చిన, ఆయన తన గత యజమాని ప్రపంచ బ్యాంకు నుంచి మోసుకొచ్చిన ఎల్‌పీజీ విధానాల గురించి దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న తరుణంలో… వాటికి పురుడుపోసిన కాంగ్రెస్సే రాష్ట్రంలో అధికారంలో ఉంది.పైన చెప్పుకున్న అనేకానేక సమస్యలకు, వాటిని పరిష్కరిం చకపోవటానికి ఎల్‌పీజీ విధానాలే కారణమని ఆర్థికవేత్తలు, నిపుణలు నొక్కి చెబుతున్నారు. అనేక దేశాల అనుభవం కూడా అదే. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆ విధానాలను మరింత దుందుడుకుగా అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, దానికి మతంరంగు అద్దింది. ఈ పదకొండేండ్ల ఏలుబడిలో ‘కార్పొరేట్, కమ్యూనల్’ గొలుసు బలపడి, మరింత ధృడ పడింది. అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయింది. ఆర్టికల్ 370 రద్దు సంప్రాప్తించింది. కామన్ సివిల్ కోడ్ దిశగా అడుగులు పడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో, తాజాగా రాజస్థాన్‌లోని మసీదులు, దర్గాలపై మతోన్మాదుల కన్ను పడింది. ఇలాంటి తరుణంలో కార్మికవర్గ శ్రేయస్సు, రైతురాజ్యం, పేదల బతుకుల్లో వెలుగుల్లాంటి డైలాగులకు అర్థమే లేదు, అసలు స్థానమే లేదు.
కానీ తమది ప్రజా పాలనంటూ చెప్పుకుంటున్న రేవంత్ సర్కారు… తనకున్న పరిధులు, పరిమితుల మేరకైనా ప్రజల బాగుకోసం పనిచేయాలి. ఆర్థిక విధానాలను ఇప్పటికిప్పుడు మార్చలేకపోయినా తనకున్న వెసులు బాట్ల ఆధారంగా పాత చట్టాలు, జీవోలనైనా అమలు చేయగలిగే సామర్థ్యాలను సంతరించుకోవాలి. లేబర్ కోడ్‌లు తదితరాం శాలపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ గొంతెత్తాలి. బీఆర్‌ఎస్ సర్కారు చేసిన తప్పులను ఎండగడుతూనే, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి.
ఎంతసేపూ ఫార్ములా ఈ కార్ రేస్ తదితరాల చుట్టూ కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే పనులకు శ్రీకారం చుట్టాలి. తద్వారా ‘2025ను ప్రజానుకూల విధానాల సంవత్సరం’గా మార్చాలి. అంతేతప్ప కొత్త సంవత్సరంలో కూడా ‘కాసులు, కేసులు, కమీషన్ల’ చుట్టే కథ నడుపుతామంటే అది ‘ప్రజాపాలన’కు శోభనివ్వదు.