ఆశావహుల భావోద్వేగాలు, నిరసనలు

Aspirants' emotions and protests– పార్టీకి, అధినాయకుడికి ఎల్లవేళలా విధేయుడిగా ఉంటా..
– భావోద్వేగంతో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే డా||రాజయ్య
– మైనంపల్లిని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి
నవతెలంగాణ – స్టేషన్‌ ఘన్‌పూర్‌/సిద్దిపేట
ఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ప్రకటనతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆశావాహుల భావోద్వేగాలు, అనుచరుల నిరసనలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు స్థానం దక్కకపోవడంతో కార్యకర్తలు, అభిమానులను చూసి బోరున విలపించారు. మంగళవారం నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. బస్టాండ్‌ వద్దనున్న అంబేద్కర్‌ విగ్రహం ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తనను వారించేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానుల నుద్దేశించి మాట్లాడారు. నిత్యం ప్రజల్లో ఉండడమే నాకు తెలుసని, ఎవ్వరూ అధైర్యపడొద్ధని, సంయమనం పాటించాలని, అధినాయకుడు సీఎం కేసీఆర్‌ గీసిన గీత దాటనని తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్‌ పిలుపుతో 2011లో కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన వెంట వచ్చానన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించిన సమయంలోనూ కేసీఆర్‌ వెంటే నడిచానని, నా స్థాయి తగ్గకుండా కాపాడుకుంటానని.. తనకు కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ సముచిత స్థానం కల్పిస్తారనే ఆశ ఉందన్నారు. డిసెంబర్‌ 13 వరకు ఎమ్మెల్యేగా కొనసాగుతానని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన మైనార్టీ బంధు, బీసీ బంధు, దళితబంధు, గృహలక్ష్మి, 100 పడకల ఆస్పత్రి శంకుస్థాపనకు త్వరలోనే మంత్రి హరీశ్‌ రావు వస్తారని తెలిపారు. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు ప్రజల కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఆకుల కుమార్‌, ఎర్రోళ్ల కుమార్‌ గౌడ్‌, మండల అధ్యక్షులు మాచర్ల గణేష్‌, సర్పంచ్‌ సురేష్‌ కుమార్‌, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లికి వ్యతిరేకంగా మంగళవారం కొమురవెల్లి మల్లన్న అలయ బోర్డు మెంబర్‌ మరుపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ (గుండు శ్రీను) ప్లకార్డులతో నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. బీఆర్‌ఎస్‌ నాయకులు నటరాజ్‌, సాయి, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మన్నే క్రిశాంక్‌ టికెట్‌ దక్కకపోవడంపై స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తాను కేటీఆర్‌ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటూ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు.