– బీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ రావడంతో తీవ్ర పోటీ
– మెదక్‌లో తప్ప ఆరు నియోజకవర్గాల్లో కారుదే గెలుపు
– చిలుముల మదన్‌రెడ్డి, వంగ ప్రవీణ్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, పట్నం మాణిక్యం,వంటేరు
– ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినందున ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దాంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీఆర్‌ఎస్ ఆరు చోట్ల విజయం సాధించింది. మెదక్ అసెంబ్లీ సీటు మాత్రమే కోల్పోయింది. గెలిచిన బీఆర్‌ఎస్ ఆరుగురు ఎమ్మెల్యేలకు కలిపి 2 లక్షల ఓట్ల మెజార్టీ రావడంతో ఎంపీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఎమ్మెల్యేలుగా గెలిచినందున బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ఎక్కువ అవకాశాలున్నాయనే అంచనాల్లో ఆశావాహులున్నారు.
2004 నుంచి వరుస విజయాలు
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలతో కూడిన మెదక్ ఎంపీ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది. బీఆర్‌ఎస్ వరుసగా గెలుస్తూ వస్తుంది. 2004 అలె నరేంద్ర, 2009లో విజయశాంతి, 2014 సాధారణ ఎన్నికల్లో కె.చంద్రశేఖర్‌రావు గెలిచారు. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో 2014 ఉప ఎన్నికతో పాటు 2019 జనరల్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. వరుసగా ఐదు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్‌ఎస్ అధిష్టానం చూస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందున వచ్చే ఎన్నికల్లోనూ మెదక్ ఎంపీ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలంటే గెలుపు గుర్రాన్నే బరిలోకి దించాలని చూస్తున్నారు. అందు కోసం ప్రజా బలంతో ఆర్థిక పరిపుష్టి ఉన్న దీటైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పలువురు ఆశావాహులు
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సీటును త్యాగం చేశారు. సునీతాలక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చినందున మదన్‌రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు హామీ ఇచ్చారని, ఆ ఒప్పందం ప్రకారం మదన్‌రెడ్డి సునీతారెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మదన్‌రెడ్డికే ఎంపీ టికెట్ ఇస్తారా..? లేక వయో భారంతో ఉన్నందున రాజ్యసభకు పంపి పార్లమెంట్ ఎన్నికల్లో మరొకర్ని పోటీ చేయిస్తారా..? అనే చర్చ నడుస్తుంది. సిద్దిపేట అర్బన్ ఎంపీపీ వంగ సబిత భర్త వంగ ప్రవీణ్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో తెరవెనకాల ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్గిన ప్రవీణ్‌రెడ్డి ఎంపీ టికెట్ పరిశీలనలో ఉన్నారు. హరీశ్‌రావుకు నమ్మకమైన వ్యక్తి కావడంతో పాటు ప్రవీణ్‌రెడ్డి బావ జైచంద్రారెడ్డ్డి సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్డీఓగా పనిచేసి ప్రస్తుతం తూప్రాన్ ఆర్డీఓగా ఉన్నారు. అదే విధంగా గాలి అనిల్‌కుమార్ కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన రెండో స్థానంలో నిలిచారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని బీఆర్‌ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పట్నం మాణిక్యం అవకాశం దక్కలేదు. మెదక్ ఎంపీ టికెట్ అడుగుతున్నారు.
వంటేరు ప్రతాపరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ టికెట్ అడిగారు. ఆయన అంతకు ముందు కాంగ్రెస్ నుంచి కేసీఆర్‌పైనే పోటీ చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి పోటీ చేయడంతో వంటేరు ప్రతాపరెడ్డి నొచ్చుకున్నారు. ఆ సందర్బంలోనే వంటేరు ప్రతాపరెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయనే ప్రకటించారు. సీఎం హౌదాలో కేసీఆర్ పోటీ చేసినందున ఆయన గెలుపు కోసం వంటేరు కష్టపడి పనిచేశారు. దీంతో ఆ కృతజ్ఞతతో తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వంటేరు కోరుతున్నారు. మెదక్ డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మెదక్ టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. తిరుపతిరెడ్డికి కూడా ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో 2 లక్షల మెజార్టీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థుల కంటే రెండు లక్షలు అదనంగా ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. సిద్దిపేటలో హరీశ్‌రావుకు 8,23,08 ఓట్ల మెజార్టీ వచ్చింది. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి 53,513 ఓట్ల మెజార్టీ, గజ్వేల్‌లో కేసీఆర్‌కు 45,031 ఓట్ల మెజార్టీ, నర్సాపూర్‌లో సునీతాలక్ష్మారెడ్డికి 8855 ఓట్ల మెజార్టీ, సంగారెడ్డిలో చింత ప్రభాకర్‌కు 8217 ఓట్ల మెజార్టీ, పటాన్‌చెరులో గూడెం మహిపాల్‌రెడ్డికి 7091 ఓట్ల మెజార్టీ వచ్చింది. మెదక్ నియోజకవర్గంలో మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఓడిపోయింది. ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి మైనంపల్లి రోహిత్‌రావు 10,157 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆరు నియోజకవర్గాల్లో గెలిచిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు 2,05,015 ఓట్ల మెజార్టీ ఉంది. మెదక్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వచ్చిన మెజార్టీ పోను బీఆర్‌ఎస్‌కు 1,94,858 ఓట్ల మెజార్టీ ఉంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించి ఎంపీ అభ్యర్థిని గెలుపించుకోవాలనే వ్యుహంతో ముందుకెళ్తున్నారు.