కాంగ్రెస్‌లో కోలాహలం.. టికెట్ల కోసం ఆశావహుల కుస్తీ

– బీఆర్‌ఎస్‌ నేతల ఎంట్రీతో గందరగోళం
– ఇన్నాళ్లూ కష్టపడిన వారి సంగతేంటంటూ నేతల ప్రశ్న
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గ్రూప్‌ వార్‌
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకే టికెట్‌ కట్టబెట్టడంతో ఆ పార్టీ నేతలంతా అసంతృప్తితో రగలిపోతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలోనూ కయ్యం మొదలైంది.. బీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్‌ దక్కని ఆశావహులు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. టికెట్‌ దక్కని బీఆర్‌ఎస్‌ లీడర్‌ ఏ నియోజకవర్గంలోకి అడుగు పెడతారో.. ఎవరి టికెట్‌ గల్లంతు అవుతుందోనని కాంగ్రెస్‌లో చర్చ జోరుగా సాగుతోంది.
నకిరేకల్‌పై తీవ్ర ఉత్కంఠ..
నకిరేకల్‌ నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించగా, టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడంతోపాటు.. త్వరలోనే ప్రముఖ పార్టీలో చేరి పోటీ చేస్తానని ప్రకటించారు. కొంతకాలంగా వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. మొదటిసారిగా ఆయన బహిరంగంగా వేదికపై పార్టీ మారుతున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు బలం చేకూరినట్టయింది. ఆయన కాంగ్రెస్‌లో చేరితే.. మరి ఇన్నాళ్లూ పార్టీని మోసిన ఆ నియోజకవర్గ నేతల సంగతేంటనేది చర్చ సాగుతోంది. నకిరేకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ టికెట్‌ను దైద రవీందర్‌, వేదాసు శ్రీధర్‌, నలగాటి ప్రసన్నరాజ్‌, కొండేటి మల్లయ్య తదితరులు ఆశించారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంట్రీ ఇస్తే.. ఈ నేతల భవిష్యత్‌ ఏంటనే చర్చ లేకపోలేదు.
ఈ నియోజకవర్గాల్లో ఎవరికి దక్కేనో..
ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ కంటే బలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నకిరేకల్‌, మిర్యాలగూడ, కోదాడ, ఆలేరు, భువనగిరి, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లో గ్రూప్‌ వార్‌ వల్ల అభ్యర్థుల ఎంపికపై కొంత సందిగ్ధత నెలకొంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి అమరేందర్‌ రెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు టికెట్‌ రేసులో ఉన్నారు. మునుగోడులో చల్లమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్న కైలాష్‌నేత పోటీలో ఉన్నారు. కోదాడలో ఉత్తమ్‌పద్మావతి ఒక్కరే ప్రస్తుతానికి ఉన్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ కన్మంతరెడ్డి శశిధర్‌ రెడ్డి, ముత్తవరపు పాండు రంగారావు, కోదాడ మున్సిపల్‌ చైర్మెన్‌ భర్త వనపర్తి లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లోకి జంప్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఆలేరులో ఇప్పటికే బీర్ల అయిలయ్య, కల్లూరి రామచంద్రారెడ్డి టికెట్‌ కోసం కుస్తీ పడుతుండగా, బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, కుడుదుల నగేశ్‌ వంటి నేతలు పోటీ పడుతున్నారు. భువనగిరి నియోజకవర్గంలో కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో చింతల వెంకటేశ్వర్‌ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌ పేర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సైతం భువనగిరి కాంగ్రెస్‌ టికెట్‌ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ గేట్లు క్లోజ్‌ కావడంతో నేతల చూపంతా కాంగ్రెస్‌ వైపునకు మళ్లిందనే చెప్పాలి.