అసద్‌ పతనం, సిరియా కల్లోలం

Assad's fall is Syria's upheavalసిరియాలోకి తహ్రీర్‌ అల్‌ షామ్‌, ఇంకా ఇతర సాయుధ వర్గాలు వేగంగా చొచ్చుకుపోవడంతో బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసింది. ఆ విధంగా పశ్చిమాసియాలోని ఆఖరి లౌకిక ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో అమెరికా కృతకృత్యమైంది. ఆఫ్ఘనిస్థాన్‌లోనూ పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని ఇరాక్‌, లిబియాలలో ఇక ఇప్పుడు సిరియాలోనూ లౌకిక ప్రభుత్వాలను కూల్చడంలోనే గాక తీవ్ర మతశాఖా యుద్ధాలను రాజేయడానికి కూడా అమెరికా సైనిక జోక్యం కారణమైంది. అమెరికా, అలాగే దాని సహాయంతో చెలరేగిన భస్మాసుర తీవ్రవాద బృందాలు సృష్టించిన విధ్వంసకాండ ప్రతి చోటా శాంతి, సుస్థిరతలకు ముప్పుగా పరిణమిస్తున్నది.2011లో మొదలైన అంతర్యుద్ధం తర్వాత సిరియా మూడు ప్రాంతాలుగా విభజితమైంది. ఆ భూభాగంలో 65శాతం మాత్రమే అసద్‌ ప్రభుత్వ అదుపులో వుండింది. రష్యా ఇరాన్‌ దానికి సహాయం అందించాయి. ఆ విధంగానే ఆ ప్రభుత్వం భూభాగాన్ని అదుపులో వుంచుకుంటూ తీవ్రవాద బృందాల దాడులను తిప్పికొట్టగలిగింది.
అంతర్గత పరిస్థితులు
25 శాతం భూభాగంతో కూడిన రెండవ ప్రాంతం అమెరికా మద్దతుగల సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌ (ఎస్‌.డి.ఎఫ్‌) అదుపులో సాగింది. తక్కిన ప్రాంతం ప్రత్యేకించి వాయువ్య భాగాలు హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ (హెచ్‌.టి.ఎస్‌) అధీనంలో వుంటూ వచ్చింది. అల్‌ ఖైదా, అల్‌ నుస్రా ఫ్రంట్‌ల నుంచి పుట్టిందే ఈ సంస్థ. 2016లో ప్రత్యేక సంస్థగా ప్రకటించుకున్న హెచ్‌.టి.ఎస్‌ ప్రబలమైన మిలిటెంట్‌ గ్రూపుగా రూపుదాల్చింది. అమెరికా, రష్యా, టర్కీలు దాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించినా అసద్‌ను వ్యతిరేకించే దేశాలు దానికి లోపాయికారిగా అండనిస్తూ వచ్చాయి. ఇడ్లిబ్‌ స్థావరంగా చేసుకున్న హెచ్‌.టి.ఎస్‌ గతేడాది కాలంగా ఆయా శక్తులను సమీకృతం చేసేందుకు చురుగ్గా పని చేస్తూ దాడికి దిగింది. టర్కీ మద్దతుగల సిరియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఎస్‌.ఎన్‌.ఎ) అనే మరో తీవ్రవాద వర్గం కూడా అదే సమయంలో మరో వైపు నుంచి దాడి చేయడం ఈ దాడికి ఊపునిచ్చింది. సిరియా ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారులైన రష్యా, ఇరాన్‌లు తమ తమ సరిహద్దు దేశాలలో సాగుతున్న సంఘర్షణలలో తలమునకలవుతున్నాయి. సిరియా ప్రభుత్వ రక్షణలో కీలక పాత్ర వహించే హిజ్బుల్లా ఇజ్రాయిల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో నిమగమైంది. ఈ కారణాలన్నీ కూడా అప్పటికే సంక్షోభంలో వున్న సిరియా ప్రభుత్వ మద్దతు మరింత బలహీనపడటానికి దారితీశాయి.
అసద్‌ నిరంకుశ పాలన
అసద్‌ కూడా జనరంజకమైన అధ్యక్షుడేమీ కాదు. ఆయన ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు ప్రజలలో అసంతృప్తికి కారణమైనాయి. బల ప్రయోగంతో ఆ నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజాస్వామిక హక్కులన్నీ కోతకోస్తూ నిరంకుశ పాలనను రుద్దింది. అమెరికా మద్దతుగల సామ్రాజ్యవాద శక్తులు ఈ అసంతృప్తిని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు పూనుకున్నాయి. అల్‌ఖైదా, దాని స్థానిక సహచర సంస్థగా వున్న అల్‌ సస్రా వంటి తీవ్రవాద సంస్థలను ప్రయోగించి అంతర్యుద్ధాన్ని రగిలించాయి. ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదానికి ప్రధాన దోస్తుగా వున్న ఇజ్రాయిల్‌ కూడా ఈ కల్లోల సృష్టిలో పాత్ర పోషించింది.ఈ అంతర్యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. అరవై లక్షల మందికి పైగా సిరియన్లు శరణార్ధులై దేశం వదలి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధ్వంసం వల్ల కలిగిన నష్టం వందల కోట్లలో వుంటుంది. దశాబ్ది పైగా సాగిన ఈ అంతర్యుద్ధం ముగిసిన తర్వాత కూడా సిరియా ప్రభుత్వం ప్రజల బాధలు తీర్చలేకపోయింది.హిజ్బుల్లాకు ఆయుధ సరఫరాను అడ్డుకుని ముప్పు తగ్గించే పేరిట ఇజ్రాయిల్‌ గడచిన ఒక్క ఏడాదిలో సిరియా లోతట్టు భాగాలపై బాంబులు కురిపించింది. ఈ దాడులను ప్రతిఘటించడం లేదా తిప్పికొట్టడం కూడా సిరియా చేయలేక పోయింది. అన్ని వైపులా సంక్షోభాలలో చిక్కుకు పోయిన సిరియా సైనికులు ఎదురు దాడులకు కూడా సిద్ధం కాలేదు.తన నిరంకుశ స్వభావం కారణంగా సిరియా ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. అదే దాని ప్రధాన బలహీనత అయ్యింది. ఈ కారణాల వల్లనే తీవ్రవాద వర్గాలు దాడి ప్రారంభించినపుడు సిరియా సాయుధ బలగాల్లో మిగిలినవేవైనా వున్నా కూడా ఎలాంటి ప్రతిఘటన చేయలేక తేలిగ్గా లొంగిపోయాయి. అధ్యక్షుడు అసద్‌ కూడా దేశం వదలి పారిపోయి రష్యాలో ఆశ్రయం పొందారు.
ఇజ్రాయిల్‌ దాడులు, టర్కీ వ్యూహాలు
అసద్‌ పతనం తర్వాత వెనువెంటనే ఇజ్రాయిల్‌ సిరియాపై సాయుధ దాడులు తీవ్రం చేసింది. డిసెంబరు10-11 తేదీల మధ్య 48 గంటలలో ఇజ్రాయిల్‌ 480కి పైగా వైమానిక దాడులు జరిపింది. ఇవి గత ఏడాది మొత్తం మీద చేసిన దాడులకన్నా ఎక్కువే. సిరియా ఆయుధాలు మందుగుండు తీవ్రవాదుల చేతుల్లో పడకుండా చూసేందుకే తాను దాడులు తీవ్రం చేసినట్టు ఇజ్రాయిల్‌ చెప్పుకుంటున్నది. తన ఆక్రమణలోని గోలన్‌హైట్స్‌ సమీపంలో సిరియాతో గల మధ్యంతర ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్ని దాటి తమ సైన్యాలు సిరియా భూగాలలో ప్రవేశించాయని కూడా ఇజ్రాయిల్‌ అధికారికంగా ప్రకటించింది. ఇది మరోసారి ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఇజ్రాయిల్‌ పచ్చిగా ఉల్లంఘించడమే. సిరియాలో సాధ్యమైనంత ఎక్కువ భూభాగం ఆక్రమించి గ్రేటర్‌ ఇజ్రాయిల్‌ ఏర్పాటు చేయాలని కరుడుగట్టిన యూదు జాత్యహంకార మితవాద వర్గాలు ఊగి పోతున్నాయి.మరో వంకన టర్కీ కూడా తన నియంత్రణ ప్రాంతం పెంచుకోవాలనీ, ప్రాంతీయ పేరాశలను నెరవేర్చుకోవాలనీ ఉవ్విళ్లూరుతున్నది. కుర్దులపై దాడి చేసి వారి భూభాగాలు ఆక్రమించుకోవాలని ఎస్‌ఎన్‌ఎను పురికొల్పు తున్నది. స్వయం పాలక కుర్దిస్థాన్‌ కావాలంటూ కుర్దుల నుంచి వస్తున్న డిమాండువల్ల కలిగే ముప్పు లేకుండా చేసుకోవాలన్నది దాని కోర్కె. ఉత్తర సిరియాలో టర్కీ మద్దతుగల కుర్ద్‌ నాయకత్వంలోని దళాలు కేవలం మూడు రోజులలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు తీసినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి.
పాక్షిక ఘర్షణలు తీవ్రం
సున్నీలు షియాలు, కుర్దులు, అలవైట్లు, డ్రూజ్‌లు, క్రైస్తవులు సిరియాలో జీవిస్తున్నారు. తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోట్లాడుకునే తీవ్రవాద గ్రూపుల కారణంగా రానున్న రోజుల్లో పాక్షిక ఘర్షణలు తీవ్రమవడం తథ్యం. ఈ పరిస్థితి దిగజారి మరో అంతర్యుద్ధం మారేందుకు ఎంతైనా అవకాశముంది. అసద్‌ ప్రభుత్వ పతనం తర్వాత ఆశలు పెట్టుకున్న సిరియా ప్రజలకు అది హానికరమవుతుంది. మహ్మద్‌ అల్‌ బషీర్‌ ప్రధాన మంత్రిగా 2025 మార్చి వరకూ ఒక తాత్కా లిక ప్రభుత్వ ఏర్పాటును తీవ్రవాద బృందాలు ప్రకటించాయి. ప్రజలు ఐక్యంగా నిలవాలనీ తదనుగుణంగా తాను పాలన అంది స్తానని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెచ్‌టిఎస్‌ వంటి తీవ్రవాద బృందాల పాలనలోని దేశాలు, ప్రాంతాల అనుభవం రీత్యా అలాంటి వాగ్దానాలకు మనం ఏ మాత్రం నమ్మలేము.సిరియా భవిష్యత్తు ఎలా వుండాలనేది ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి తప్ప ఎలాంటి బయటి శక్తుల ప్రభావం గానీ జోక్యం గానీ బెదిరింపులు గానీ వుండకూడదు. తమ మహాధి పత్య దురాశలను నెరవేర్చుకోవడానికి గాను సిరియాను ఒక రంగ స్థలంగా ఉపయోగించుకోవడానికి సామ్రాజ్యవాదానికి, యూదు జాత్యహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
(డిసెంబరు 11 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)