అసోం సీఎం నిర్వాకం !

Assam CM administration!– ఖజానా ఖర్చుతో పార్టీ ప్రచారం
– హెలికాప్టర్లు, విమానాల్లో విహారం
– వివాహాలకూ సర్కారు సొమ్ముతోనే ప్రయాణం
గౌహతి : బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని సొంత పనుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ, బయట బీజేపీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిసారీ హెలికాప్టర్లు, ఛార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకొని విహరిస్తున్నారు. అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. పార్టీ కార్యక్రమాలతో పాటు వివాహాలకు హాజరయ్యేందుకు కూడా ఆయన ప్రభుత్వ సొమ్మునే వాడుకుంటున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ కాదు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు అసోం ప్రభుత్వం ఇచ్చిన సమాధానం.
క్రాస్‌కరంట్‌ అనే స్వతంత్ర వార్తా సంస్థ 2022 ఆగస్ట్‌ 26న శర్మ ఖర్చులపై ఆర్‌టీఐ ద్వారా సమాధానం కోరింది. పన్ను చెల్లింపు దారుల సొమ్ముతో శర్మ హెలికాప్టర్లు, ఛార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకొని పార్టీ సమావే శాలతో పాటు అనేక వివాహా లకు హాజరయ్యారని ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో తేలింది. అధికా రేతర కార్యకలాపాల కోసం ఏ ప్రభుత్వమూ ప్రజా ధనాన్ని ఉప యోగించకూడదు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు హాజరవడం, ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లడం వంటివి అధికారేతర కార్యకలాపాల కిందికే వస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాల కోసమే సొమ్ము చెల్లించి ఛార్టర్డ్‌ విమానాలను అద్దెకు తీసుకున్నామని గత సెప్టెంబరులో శర్మ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా తెలిపింది. శర్మ చేసిన ఖర్చులకు సంబంధించి ప్రభుత్వ ఆర్థిక పద్దులపై సమాచారం కోరుతూ ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు తొలుత రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ స్పందించలేదు. దీనిపై క్రాస్‌కరెంట్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖలో పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారిగా పనిచేస్తున్న ప్రదీప్‌ శర్మ గత సంవత్సరం సెప్టెంబర్‌ 30న కొంత సమాచారం అందించారు. అయినప్పటికీ అది పాక్షికంగానే ఉంది.
రాష్ట్రంలోనే కాదు…ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు కూడా బిశ్వ శర్మ ప్రభుత్వ సొమ్మును వెచ్చించి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. త్రిపురలో పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా నామినేషన్‌ దాఖలు చేస్తుంటే అక్కడికీ హాజరయ్యారు. అంతేకాదు…కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రభుత్వ సొమ్ముతో హెలికాప్టర్లు, ఛార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకున్నారు. నాగాలండ్‌లో ప్రచారానికి వెళ్లినప్పుడూ ఇదే తంతు.
ఐదు వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కూడా బిశ్వ శర్మ సర్కారీ సొమ్ముతో హెలికాప్టర్లు అద్దెకు తీసుకొని వెళ్లడం గమనార్హం. 2022 నవంబర్‌ 11న నాగాలాండ్‌ ముఖ్యమంత్రి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు హెలికాప్టర్‌ ప్రయాణానికి అయిన ఖర్చు 14 లక్షల రూపాయలు. గత సంవత్సరం జనవరి 31న యూపీ ఉప ముఖ్యమంత్రి కుమార్తె వివాహానికి వెళ్లినందుకు అయిన ఖర్చు రూ.23.43 లక్షలు. వీటితో పాటు మరో మూడు వివాహాలకు కూడా ఆయన ప్రభుత్వ సొమ్మునే వినియోగించి హెలికాప్టర్‌లో ప్రయాణించారు. 2021 సెప్టెంబర్‌ 22 నుండి 2023 జనవరి 24 వరకూ ఆయన ఏడుసార్లు ఛార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకొని బీజేపీ కార్యక్రమాలకు హాజరయ్యారు.
అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన అసోంపై ముఖ్యమంత్రి బిశ్వ శర్మ విహార ఖర్చులు పెను భారాన్ని మోపుతున్నాయి. తరుణ్‌ గొగోరు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్ర రుణ భారం రూ.41,963 కోట్లు. గత ఎనిమిది సంవత్సరాల బీజేపీ పాలనలో అది ఇబ్బడిముబ్బడిగా పెరిగి 2022-23 నాటికి అది రూ.1,26,281.4 కోట్లకు చేరింది.
కోడ్‌ను ఉల్లంఘించి…
ముఖ్యమంత్రి సొంత సామాజిక మాధ్యమ హ్యాండిల్స్‌ నుండి సేకరించిన ఫొటోల ప్రకారం ఆయన కనీసం ఐదుసార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తేలింది. బీజేపీ భాగస్వామ్య పక్షమైన యూపీపీఎల్‌ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం 2021 అక్టోబర్‌ 17న బిశ్వ శర్మ హెలికాప్టర్‌ను ఉపయోగించారు.ఆ మరునాడే ఓ స్మారక సమావేశానికి హాజరయ్యేం దుకు మరోసారి హెలికాప్టర్‌ను వాడారు. ఆ మరునాడు యూపీపీఎల్‌కు మరో అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు హెలికాప్టర్‌లో వెళ్లారు. 2021 అక్టోబర్‌ 30న అసోంలోని కొన్ని శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లలోనే విహరించారు.చివరికి ఓ అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని దాఖలు చేస్తుంటే ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కూడా ప్రభుత్వ ఖర్చుతో ఆకాశ యానం చేశారు.