అమెరికా ప్రభుత్వం ఈ కేసుతో జర్నలిజాన్ని ఒక నేరంగా మార్చింది. వార్తల సేకరణ, ప్రచురణను నేరంగా పరిగణించింది.తోటి జర్నలిస్టులు వాస్తవాన్ని గ్రహించి కేసు తీరుతెన్నులను బహిర్గత పరచాలని అసాంజే భార్య స్టెల్లా యావత్ విజ్ఞప్తి చేసింది. అసాంజే ఉదంతంతో పరిశోధనాత్మక జర్నలిజం ఇక ముందు కూడా ఆగదు, తమ పాలకుల దుర్మార్గాలను వెల్లడించాలని చిత్తశుద్ధితో పనిచేసే జర్నలిస్టులకు ఈ ఉదంతం ఓ ధైర్యన్ని ఇచ్చింది. ఇక ముందు ఈ స్పూర్తి కొనసాగుతుంది.మీడియా స్వేచ్ఛ దేశద్రోహం కాదు.ప్రజల పక్షాన నిలవటమే జర్నలిజం వృత్తి ధర్మం.ప్రతి ఒక్క జర్నలిస్టుకూ అసాంజే ఒక రోల్ మోడల్. నియంతృత్వ ప్రభుత్వాలకు ఓ హెచ్చరిక కూడా.
మొదటి నుండి అమెరికా అగ్రరాజ్యం. తన అగ్ర రాజ్యహోదా కోసం ఏ దేశాన్నైనా తేలిగ్గా బలిపెట్టగలదు.పచ్చటి భూముల్ని మరుభూములుగా మార్చగలదు. జపాన్‌పై అణుబాంబును ప్రయోగించి మానవ మారణ హోమాన్ని సృష్టించింది. తాను తప్ప ఏదేశమూ పచ్చగా,శాంతియుతంగా ఉండటాన్ని సహించలేదు.ఇరుగు పొరుగు దేశాలు సఖ్యతగా ఉంటే చూడలేదు. తన ఆధిపత్యం కోసం ఇరుదేశాల మధ్య యుద్ధాలను సృష్టిస్తుంది.ఆ దేశాలకే మళ్లీ మారణాయిధాలను అమ్ముకొని లాభాలు గడిస్తుంది.తన దేశంలో సహజ వనరులను భవిష్యత్ తరాలకు భద్రంగా దాచుకుంటుంది.ఇతర దేశాల వనరులను తన బలంతో తవ్వితీసి తన దేశ అవసరాలకు వాడుకుంటుంది. పేరుకోసం మానవ హక్కుల గురించి మాట్లాడుతుంది.కానీ జాతివివక్షతలను పాటించటంలో ఆ దేశానినిది అగ్రస్థానం.
ఇలాంటి అమెరికాలో అగ్రరాజ్య ముసుగులో దాగివున్న నయవంచన, దుర్మార్గాలను సాధికారికంగా బయటపెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన వికీలీక్స్ సంస్థ స్థాపకుడు, జూలియన్ అసాంజే పై ‘గూఢాచర్యం’ ఆరోపణలతో పద్నాలుగు సంవత్సరాలు నిర్భందించింది. నానా అగచాట్లకు గురిచేసింది.చివరకు ఆయన విడుదలకోసం అమెరికా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆయన మీద మోపబడిన నేరాన్ని అసాంజే అంగీకరించాడు. ఈ నేరానికి ఐదేండ్ల జైలు శిక్షను విధించారు.అయితే అసాంజే బ్రిటన్‌లో ఇప్పటికే అంతకంటే ఎక్కువ కాలం జైల్లో శిక్ష అనుభవించినందున శిక్షాకాలం పూర్తయినట్లు భావించి ఆయన్ను మూడురోజుల కిందట విడుదల చేశారు.వెంటనే ఆయన తన మాతృదేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.అక్కడ ప్రజల నుంచి, ప్రజాస్వామికవాదుల నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి కూడా ఘన స్వాగతం లభించింది.
ఇరాక్‌లో అమెరికా దారుణాలను అసాంజే నేతృత్వంలోని వికీలీక్స్ బయటపెట్టింది. ఇరాక్‌లో అణు ఆయుధాలు,రసాయన ఆయుధాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేసింది. ప్రపంచాన్ని నమ్మించింది. అన్యాయంగా సద్దాం హుస్సేన్‌ను ఉరితీసింది. అలాగే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దుశ్చర్యలను బయటపెట్టింది.ప్రపంచం ముదు అమెరికాను ఒక దోషిగా నిలబెట్టడమే అసాంజే చేసిన నేరమా? అమెరికా లాంటి దేశంలో కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని దాటి అనేక ప్రభుత్వ రహస్య పత్రాలను, అధికారిక డాక్యుమెంట్లను సంపాదించిన సాహసోపేతమైన జర్నలిస్ట్ అసాంజే. ఒక ఇన్విస్ట్రిగేటీవ్ జర్నలిస్టుగా ప్రభుత్వం దమననీతిని ఎండగట్టడం ఆయన వృత్తి ధర్మం. చెల్సియా మానింగ్ అనేక అమెరికా మిలిటరీ అధికారిణి ద్వారా అస్సాంజే రహస్య పత్రాలు సేకరించాడు. ఈ అంశం బయట పడిన తరువాత ఆమె మీద ప్రభుత్వం వివిధ కేసులు మోపింది. సుమారు 35 ఏండ్ల జైలు శిక్ష ,జరిమానా కూడా విధించింది. కానీ ఆనాటి అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఆ శిక్షాకాలాన్ని ఏడేండ్లకు తగ్గించాడు. దానితో 2017లో ఆమె జైలు నుంచి విడుదలైంది. ఆ తరువాత ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా చెల్లించటానికి సిద్ధపడింది. ఆమె అసాంజేకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం ఇవ్వలేదు.
జర్నలిస్టుగా ఒక ప్రభుత్వ నేరపూరిత చర్యను ప్రజలకు తెలపడం అసాంజే భాధ్యత.అందుకు తగిన సాక్షాధారులను సేకరించి ప్రపంచానికి ఇంటర్నెట్ ద్వారా వీకీలీక్స్ సాధనంగా ప్రపంచానికి తెలిపాడు. దానికి అమెరికా ప్రభుత్వం అతనిపై కక్షకట్టింది.ఇప్పటికే ప్రపంచంలో అనేక మంది జర్నలిస్టులు పలు దేశాల్లో ప్రభుత్వ లోపాలను సంచలనాత్మక అంశాలుగా బయట పెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు.జర్నలిస్టులు వివిధ మార్గాల్లో వారికి కావాల్సిన సమాచారం సేకరించటం వారి బాధ్యత. వారికి సహకరించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు ఎరికీ,ఎప్పటికీ చెప్పకుండా గోప్యత పాటించటం కూడా వారి వృత్తి ధర్మంలో భాగమే.
అసాంజేను విడుదల చేయాలని, జర్నలిజం వృత్తిని గౌరవించాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ ఐరోపాతో సహా అనేక దేశాలు,స్వచ్ఛంద సంస్థల నుంచి అమెరికా ప్రభుత్వంపై నానాటికీ ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.ఆ ఒత్తిడి మేరకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అసాంజేతో రాజీ పడవలసి వచ్చింది. అసాంజే ప్రస్తావన వచ్చినపుడల్లా అమెరికా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిందా? అని భావితరాలు తెలుసుకొనేందుకు ఈ ఉదంతం తోడ్పడింది. పైగా రహస్య పత్రాలను ముద్రించినందు వల్ల లేదా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉంచినందువల్ల జరిగిన నష్టం ఏమిటో రుజువు చేసేందుకు అమెరికా వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు.అందుకే కేసును విచారించిన న్యాయమూర్తి కూడా అదే అభిప్రాయం తన తీర్పులో చెప్పాడు.అలాగే అసాంజే భార్య స్టెల్లా యావత్ తన భర్త కేసుకు సంబంధించిన వివరాలను సమాచార స్వేచ్చ హక్కు చట్టం కింద అమెరికా నుంచి సంపాదించి లోకానికి వెల్లడించాల్సిందిగా తోటి జర్నలిస్టులకు విజ్ఞప్తి చేసింది. కేసు నడిచినంత కాలం భర్తకు అండగా నిలిచిన ధీరవనితగా ఆమె చరిత్రకెక్కింది.అమెను ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం ఈ కేసుతో జర్నలిజాన్ని ఒక నేరంగా మార్చింది. వార్తల సేకరణ, ప్రచురణను నేరంగా పరిగణించింది.తోటి జర్నలిస్టులు వాస్తవాన్ని గ్రహించి కేసు తీరుతెన్నులను బహిర్గత పరచాలని అసాంజే భార్య స్టెల్లా యావత్ విజ్ఞప్తి చేసింది. అసాంజే ఉదంతంతో పరిశోధనాత్మక జర్నలిజం ఇక ముందు కూడా ఆగదు, తమ పాలకుల దుర్మార్గాలను వెల్లడించాలని చిత్తశుద్ధితో పనిచేసే జర్నలిస్టులకు ఈ ఉదంతం ఓ ధైర్యన్ని ఇచ్చింది. ఇక ముందు ఈ స్పూర్తి కొనసాగుతుంది.మీడియా స్వేచ్ఛ దేశద్రోహం కాదు.ప్రజల పక్షాన నిలవటమే జర్నలిజం వృత్తి ధర్మం.ప్రతి ఒక్క జర్నలిస్టుకూ అసాంజే ఒక రోల్ మోడల్. నియంతృత్వ ప్రభుత్వాలకు ఓ హెచ్చరిక కూడా.
మన దేశంలో కూడా అనేక పేరు మోసిన పత్రికలు,ప్రఖ్యాత మీడియా సంస్థలు (ఛానళ్ళు) కార్పోరేట్లు అదానీ, అంబానీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి.అవి స్వలాభం కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు బాకా కొడుతున్నాయి.నిజమైన ప్రజా సమస్యలను చర్చకు పెట్టడం లేదు. గత పదేండ్లుగా మన ప్రధాన మీడియా కట్టు బానిసలుగా కేంద్రప్రభుత్వానికి ఊడిగంచేసి ప్రపంచ దృష్షిలో అభాసుపాలైంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘గోదీ’ మీడియా చెప్పిన కల్పిత సర్వే ఫలితాలు,జోస్యాలు, తిరగబడ్డాయి.వారు అధికార పార్టీ నేతను(మోదీని) ఇంటర్వూ చేసిన విధానం,వారు అడిగిన ప్రశ్నలు,పొగడ్తలు ప్రపంచం ముందు అప్రతిష్టను మూటకట్టుకున్నాయి.
ఇప్పుడు మనదేశంలో గోదీ మీడియాను నమ్మే నాధుడు కరువయ్యాడు.ఆ ఛానళ్ల ఊదరగొట్టే చర్చలను, అరుపులను, కేకలను వినేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.ధృవ్ రాఠీ, రవీష్ కుమార్ లాంటి ఇండిపెండెంట్ యూట్యూబర్లకు మంచి ఫాలోయింగ్ ఉంది. వారి వీడియోలకు అమాంతం లక్షల్లో అనూహ్యంగా వ్యూవర్స్ పెరిగారు.వారు ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు.మన తెలుగులో ప్రొఫెసర్ నాగేశ్వర్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, డా. ప్రసాదమూర్తి మహిళా జర్నలిస్టులు వనజ, తులసీచందూ మొదలైన యూట్యూబర్లకు వీక్షకుల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పేరుమోసిన దినపత్రికలు ఏదో పార్టీతో జతకట్టడంతో నిష్పాక్షిక వార్తలను ప్రజలకు చేరడం లేదు. ప్రజలు విశ్వసనీయతను పొందడానికి ప్రజల పక్షాన నిలిచే వామపక్ష పత్రికల్ని ఎక్కువమంది చదువుతున్నారు. ఇంకా సోషల్‌మీడియా వేదిక కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతోంది. అయితే ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలుసుకోవాల్సింది మాత్రం పాఠకులే. ఏది ఏమైనా అమెరికా దురాగతాలను వెల్లడించిన అసాంజే జర్నలిజానికి ఒక దిక్సూచి అని చెప్పక తప్పదు.
డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్
9849328496