విద్యుత్‌ జేఎల్‌ఎంపై హత్యాయత్నం

– విద్యుత్‌ కనెక్షన్‌ తీసేశారని పెట్రోల్‌ పోసి నిప్పంటించే యత్నం
– కేసు నమోదు చేసిన గజ్వేల్‌ పోలీసులు
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్‌
ఇంటికి కరెంట్‌ సరఫరా నిలిపేశారన్న కోపంతో ఓ వ్యక్తి విద్యుత్‌ జేఎల్‌ఎంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించబోయాడు. ఈ ఘటన గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలోని క్యాసారానికి చెందిన గ్రామంలో శనివారం జరిగింది. సీఐ భూమా వీర ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలోని క్యాసారంలో కరుణాకర్‌ తన ఇంటికి రెండు నెలలుగా కరెంట్‌ బిల్లు కట్టడం లేదు. దీంతో విద్యుత్‌ జేఎల్‌ఎం నరేష్‌ మీటర్‌ వైర్‌ను కట్‌ చేశారు. అయినా.. అక్రమంగా కనెక్షన్‌ పెట్టుకుని విద్యుత్‌ వాడుతున్నారన్న సమాచారంతో జేఎల్‌ఎం శనివారం కరుణాకర్‌ ఇంటికెళ్లారు. వారితో మాట్లాడి బిల్లు కట్టించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పైఅధికారుల ఆదేశాలతో విద్యుత్‌ స్తంభంపై సరఫరా నిలిపివేందుకు జేఎల్‌ఎం విద్యుత్‌ పోల్‌ ఎక్కాడు. కిందికి దిగేలోపు కరుణాకర్‌ తన బైక్‌లో నుంచి పెట్రోలు తీసి అధికారిపై పోసి నిప్పంటించేందుకు సిద్ధమయ్యాడు. పరిస్థితిని గమనించిన కరుణాకర్‌ భార్య అతని చేతిలోంచి అగ్గిపెట్టె లాక్కోవడంతో ప్రాణాపాయం తప్పింది. జేఎల్‌ఎం నరేష్‌ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కరుణాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జేఎల్‌ఎం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ భూమా వీరప్రసాద్‌ తెలిపారు.