సమాఖ్యపై దాడి

– మణిపూర్‌ హింసపై ఏచూరి
– పార్లమెంటులో చర్చకు ఇష్టపడడం లేదు
– బీజేపీ ఓడితేనే రాష్ట్రాల హక్కులకు రక్షణ
మదురై : మణిపూర్‌లో చెలరేగిన హింస సమాఖ్య పైన, దేశ భిన్నత్వం పైన జరిగిన దాడిగా సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభివర్ణించారు. దేశ లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను ఫాసిస్టు హిందూత్వ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఈ హింసాకాండకు ఆజ్యం పోసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాల హక్కుల పరిరక్షణపై ఆదివారం మదురైలో జరిగిన బహిరంగసభలో ఏచూరి ప్రసంగిస్తూ భాషలు, సంస్కృతులు, మతాలు వంటి వైవిధ్యాలను పరిరక్షించేందుకే స్వాతంత్య్ర పోరాటం జరిగిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ మాత్రం ప్రజలు అనుసరిస్తున్న మతాలను బట్టి దేశాన్ని నిర్వచించాలని చూస్తోందని మండిపడ్డారు. భారతదేశాన్ని వైవిధ్యాలను ప్రతిబింబించే రాష్ట్రాల సమూహంగా రాజ్యాంగం నిర్వచించిందని చెప్పారు. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సమానత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తి వంటి ప్రాథమిక రాజ్యాంగ మూలస్తంభాలపై అన్ని వైపుల నుండీ దాడి జరుగుతోందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మణిపూర్‌ హింసపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రధాని మోడీ నిరాకరిస్తున్నారని విమర్శించారు. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీతో ప్రధాని మోడీకి ఉన్న సంబంధాలపై ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడంతో గత పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగిందని తెలిపారు. పార్లమెంటు సరిగా పనిచేయకూడదని, తాను జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
సంబంధిత రాష్ట్రాలతో చర్చించకుండా నూతన విద్యా విధానం, నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ద్వారా రాజ్యాంగంలోని రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేస్తోందని ఏచూరి అన్నారు. కేంద్ర ఆదాయంలో 42% రాష్ట్రాలకు పంపిణీ చేయాలని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ గత సంవత్సరం పన్నులలో కేవలం 30.4% మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఇరవై రెండు ఇతర భాషలను గుర్తించకుండా ప్రజలపై హిందీని రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇది హిందూత్వ సంస్కృతిని రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నమేనని చెప్పారు.
దేశానికి పునాదులైన రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకే నేడు పోరాటం సాగిస్తున్నామని ఏచూరి అన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీని ఓడించడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కింద ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయలేకపోతున్నాయని డీఎంకే ఎంపీ తిరుచి ఎన్‌ శివ తెలిపారు. కేంద్రంలో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ ఓటమి తర్వాత విద్యను తిరిగి రాష్ట్రాల జాబితాలో చేరుస్తామని, నీట్‌, నెక్ట్స్‌ వంటి పరీక్షల నుండి విద్యార్థులను కాపాడతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ముతరసన్‌, కాంగ్రెస్‌ నేత సుదర్శన్‌ నాచియప్పన్‌, వీసీకే నాయకుడు తోల్‌ తిరుమవలవన్‌, ఎండీఎంకే మాజీ ఎంపీ ఎ.రవిచంద్రన్‌ తదితరులు ప్రసంగించారు.