మహిళా ఎంపీపై కక్షసాధింపు!

Opposition to the woman MP!– మాజీ ప్రియుడి ఆరోపణలతో చర్యలకు దిగిన మోడీ ప్రభుత్వం
– బెదిరింపులతో వ్యాపారవేత్తను దారికి తెచ్చుకున్నారు
– అఫిడవిట్‌పై సంతకం చేయించి ఫిర్యాదు చేయించారు
న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, ఆమె మాజీ ప్రియుడు, సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహన్‌రారు మధ్య పెంపుడు కుక్క కోసం చెలరేగిన వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆయనకు సన్నిహితంగా ఉండే కార్పొరేట్‌ సంస్థ అదానీ గ్రూప్‌ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో తమపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ చీకాకు పెట్టిన మొయిత్రాను ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో జై అనంత్‌ చేసిన ఆరోపణలను సాకుగా చూపి ఆమెపై చర్యలు తీసు కునేందుకు ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోంది. వ్యాపారవేత్త హీరానందానీని బెదిరించి ఆయనతో అఫిడవిట్‌పై సంతకం చేయించి, ఫిర్యాదు చేయించడం ద్వారా మొయిత్రాపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెను పార్లమెంట్‌ నుండి బయటకు పంపేందుకు కూడా పథకం రచించింది.
జై అనంత్‌ అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు కుక్క హెన్రీని, కొన్ని వస్తువులను దొంగిలించా డంటూ మొయిత్రా కొద్ది నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానం ముందు విచారణలో ఉండగానే మొయిత్రా అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారంటూ జై అనంత్‌ ఆరోపించారు. ఆయనకు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే తోడ య్యారు. ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్‌లో దూబే తన విద్యా ర్హతలను గురించి అబద్ధాలు చెప్పారని మొయిత్రా గతం లో ఆరోపించారు. దీంతో ఆమెపై అక్కసు పెంచుకు న్న దూబే తాజాగా జై అనంత్‌తో కలిసి మొయిత్రా ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొయిత్రాపై వెంటనే క్రిమినల్‌ చర్యలు చేప ట్టాలని, పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ తో కూడా విచారణ జరిపించాలని దూబే డిమాండ్‌ చేస్తున్నారు.
హీరానందానీ ఏం చెప్పారు?
జై అనంత్‌ చేసిన రెండు ఆరోపణలను హీరానందానీ గురువారం అంగీకరించారు. 2017 నుండీ మొయిత్రా తన స్నేహితురాలని ఆయన తెలిపారు. అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా ప్రశ్నలు తయారు చేసుకోవడంలో మొయిత్రా కు సహాయం చేశానని, ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఆధునీకరి ంచుకునేందుకు ఆమెకు కొన్ని బహుమతులు ఇచ్చానని అఫిడ విట్‌లో తెలిపారు. అయితే మొయిత్రా పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా జై అనంత్‌, దూబే చేసిన ప్రధాన ఆరో పణలపై మాత్రం ఆయన ఎలాంటి వివరణ ఇవ్వ లేదు. దీనిని బట్టి అర్థమ వుతోంది ఏమంటే మొయి త్రాకు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులు జరప లేదు. ఎంపీగా ఆమె చేసిన పనులకు ప్రతి ఫలంగా బహుమతులు ఇవ్వలేదు. అంటే ఎక్కడా క్విడ్‌ప్రోకో జరగలేదు.
ఘాటుగా స్పందించిన మొయిత్రా
తలపై తుపాకీని గురిపెడితే ఎలా స్పందిస్తారో హీరానందానీ కూడా అలాగే స్పందించారని మొయిత్రా వ్యాఖ్యానించారు. ఆయన రాసిన లేఖలోని అంశాలను ‘జోక్‌’గా అభివర్ణించారు. ప్రధాని కార్యాలయంలోని వ్యక్తులు అఫిడవిట్‌ను రూపొందించి, హీరానందానీ కుటుంబ వ్యాపారాలన్నింటినీ మూసివేస్తామని బెదిరిస్తూ ఒత్తిడి తెచ్చి అఫిడవిట్‌పై సంతకం చేయించారని ఆమె ఆరోపించారు. పీఎంఓ ఆయనపై ఒత్తిడి తెచ్చి, 20 నిమిషాల సమయం ఇచ్చి, బలవంతంగా సంతకం చేయించిందని మండి పడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పడా నికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘హీరానందానీ తండ్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. ఆ వ్యాపారం ప్రభుత్వ లైసెన్సులపై ఆధారపడి ఉంటుంది. ఇంధనం, డాటా కేంద్రాలు, సెమీ కండక్టర్‌ చిప్‌ తయారీ వ్యాపారాలు కూడా చేస్తుంటారు. అవి కూడా ప్రభుత్వ లైసెన్సులపై ఆధారపడ్డవే. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఆయన రూ.30 వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. మాట వినకపోతే మీ పని అయి పోయినట్లేనని ఆయనకు చెప్పారు. సీబీఐ దాడులు జరుగు తాయని బెదిరించారు. ప్రభుత్వ సాయం నిలిచి పోతుందని హెచ్చరించారు. ప్రభుత్వ బ్యాంకులు కూడా రుణాలు ఆపే స్తాయని చెప్పారు. లేఖ ముసాయిదాను ప్రధాని కార్యాల యం ఆయనకు పంపింది. విధిలేని పరిస్థితు ల్లో ఆయన దానిపై సంతకం చేశారు. అది పత్రికలకు లీక్‌ అయింది. బీజేపీ ప్రభుత్వం…దాని కంటే అదానీ నడిపే ప్రభుత్వం అంటేనే సబుబుగా ఉంటుంది. దానికి బెదిరింపులు, హెచ్చరింపులు మామూలే’ అని మొయిత్రా తెలిపారు.
మొయిత్రా పైనే ఎందుకు గురి?
ఈ సంవత్సరం ప్రారంభంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రచురితమైన దగ్గర నుండీ అదానీ గ్రూపు వ్యాపారాలపై ప్రపంచ దేశాలు నిఘా పెట్టాయి. అదానీ గ్రూపు అంతర్గత పత్రాల పైన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక రెండు కథనాలు ప్రచురించింది. ఈ రెండూ అదానీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేవే. దేశంలోని బడా మీడియా సంస్థలు ఈ వ్యవహారంపై మౌనం వహించగా ప్రతిపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జైరాం రమేష్‌ మాత్రం అదానీ గ్రూపుపై చర్య తీసుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే మొయిత్రా లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోంది.
జై అనంత్‌ ఆరోపణలేమిటి?
అసలు ఇంతకీ మొయిత్రాపై ఆమె మాజీ ప్రియుడు జై అనంత్‌ చేసిన ఆరోపణ లేమిటి? వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ తన వ్యాపార ప్రయోజనాలకు సంబంధించి పార్లమెంటులో యాభై ప్రశ్నలు అడిగితే ముడుపులు ఇస్తానని మొయి త్రాని కోరారు. ఈ ప్రశ్నలు ప్రధాని మోడీని మాత్రమే కాకుండా అదానీ గ్రూపు వ్యాపార కార్యకలాపాలను కూడా లక్ష్యంగా చేసుకొని వేయాల్సినవి. హిండెన్‌బర్గ్‌ నివేదికలో అదానీకి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుల ను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని మొయిత్రాని హీరా నందానీ కోరారని జై అనంత్‌ ఆరోపించారు.