– ప్రతిపక్ష సభ్యుల సందేహాలను నివృత్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2023-24కు మూజువాణి ఓటుతో శాసనసభ ఆమోద ముద్ర వేసింది. రూ.2,75, 891 కోట్ల బడ్జెట్‌కు అంగీకారం తెలిపింది. గురువారం శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. హుక్కా, ఇతర మాదక ద్రవ్యాలను నిషేధిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా ఆమోదం లభించినట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులకు సభ జీరో అవర్‌లో మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం కల్పించారు. జీరో అవర్ అనంతరం మధ్యాహ్న భోజన విరామ కోసం 12: 15 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తిరిగి సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఆ సందర్భంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌పై చర్చలో ఎమ్ఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ సీనియర్ సభ్యులు కడియం శ్రీహరి, బీజేపీఎల్పీ నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, బీఆర్ఎస్ సభ్యులు ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు కె.సత్యనారాయణ, రాజ్‌ఠాకూర్, తదితరులు మాట్లాడారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చర్చలో పాల్గొన్నారు. అనంతరం భట్టి మరోసారి సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రాత్రి 8:45 గంటల సమయంలో మూజువాణి ఓటుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. అనంతరం సభను శుక్రవారం ఉదయం పది గంటలకు వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా, శుక్రవారం శాసనసభలో సాగునీటిపారుదల రంగంపై ప్రత్యేక చర్చ నిర్వహించే అవకాశముంది.