– పైచేయి కోసం అధికార, ప్రతిపక్షాల ఆరాటం
– ఫ్లకార్డులు, నినాదాలతో బీఆర్‌ఎస్ వీరంగం
– ఆ పేరుతో సభను వాయిదా వేసిన ప్రభుత్వం
– ఇలాగైతే ప్రజా సమస్యలు చర్చకొచ్చేనా?
– సాంకేతికంగానే అసెంబ్లీ నడుపుతున్నారంటూ విమర్శలు
బి.వి.యన్.పద్మరాజు
ఆరు రోజుల విరామానంతరం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో.. .మళ్లీ అదే తంతు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలది అదే తీరు. ఒకరిపై మరొకరు ఆధిపత్యం, పై చేయి కోసమే అవి రెండూ పాకులాడాయి తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయాయన్న అపవాదును మూటగట్టుకున్నాయి. ఈనెల తొమ్మిదిన ఆరంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు… ఆ ఒక్కరోజు మాత్రమే కొనసాగి ఈనెల 16కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొమ్మిదిన ‘రేవంత్-అదానీ’ టీషర్టులతో సభలోకి ప్రవేశించాలని భావించి, ఉద్దేశపూర్వకంగా అరెస్టయిన బీఆర్‌ఎస్ నేతలు… ఈసారి సభలో ‘లగచర్ల రైతులకు బేడీలు’ అనే ఫ్లకార్డులను ప్రదర్శించటంతో సోమవారం సైతం సభలో గందరగోళం చోటు చేసుకుంది. నినాదాలు, ప్రతి నినాదాలతో సభ దద్దరిల్లింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ సభ్యులు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టటంతో ఈ గందరగోళం మరింత తారాస్థాయికి చేరింది. ఈ దశలో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సభను సజావుగా నడిపించేందుకు వీలుగా సభ్యులను సముదాయించాల్సిన బాధ్యత సభా వ్యవహారాల మంత్రిపైనా, చీఫ్ విప్‌పైనా ఉంటుందని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా సభను వాయిదా వేయటం పట్ల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
‘అసెంబ్లీని ప్రజాధనంతో నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఖర్చు చేసే ప్రతీ పైసా ప్రజలదే. సమావేశాలను నిర్వహించేటప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, వారి రవాణా ఖర్చులు, వాహనాలకు ఇంధనం, బందోబస్తుకు వచ్చే పోలీసులకు టీఏ, డీఏలు, శాసనసభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు అల్పాహారం, భోజనాలు వగైరాల కోసం నిమిషానికి రూ.7 వేలను ఖర్చు చేస్తున్నాం. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పుడు పెట్టిన ప్రతీపైసాకు న్యాయం చేకూర్చేలా సభ్యులు అర్థవంతమైన చర్చలు జరపాలి, తద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారాలను వెతకాలి…’ ఉమ్మడి రాష్ట్రంలో ఓ సీనియర్ అధికారి అన్న మాటలివి. ఆయన ఇది చెప్పి పదేండ్లు దాటింది. అసెంబ్లీని నిర్వహించేందుకు అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఖర్చు నిమిషానికి రూ.10 వేల కంటే ఎక్కువే అవుతుందన్నది శాసనసభ వర్గాల అంచనా. అలాంటప్పుడు మన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎంతటి నిబద్ధతతో వ్యవహరించాలి? ఎంతటి అధ్యయనం చేసి సభకు రావాలి? తద్వారా సభలో ఎంతటి అర్థవంతమైన చర్చలు సాగించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నంగాక మానవు. కానీ అందుకు భిన్నంగా పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో హైలెట్ కావటం కోసమే అన్నట్టు మన నేతలు వ్యవరిస్తుండటం బాధాకరం.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల బందోబస్తు కోసం ములుగు, మహబూబాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్, దేవరకొండ తదితర సుదూర జిల్లాలు, ప్రాంతాల నుంచి వందలాది మంది పోలీసులు ఐదారు రోజుల ముందే హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి భోజనం, బస, మరుగుదొడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించకపోయినా ఉన్న అరాకొరా సౌకర్యాలతో సరిపుచ్చుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన బందోబస్తు విధులకు సైతం ఇప్పటి వరకూ తమకు బత్తాలు (టీఏ, డీఏలు) రాలేదంటూ పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు వాపోతుండటం గమనార్హం. వీరితోపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటప్పుడు ఉదయం ఆరేడు గంటలకే ఆ ప్రాంగణానికి చేరుకునే శాసనసభ సిబ్బంది, ఒక్కో రోజు అర్థరాత్రి వరకూ పని చేయాల్సిన పరిస్థితి. ఇక మీడియా ప్రతినిధుల పరిస్థితి చెప్పనవసరం లేదు. అసెంబ్లీ సమావేశాలకు మూడు నాలుగు రోజుల ముందు ప్రారంభమయ్యే వీరి హడావుడి, అవి ముగిసిన తర్వాత ఒకట్రెండు రోజుల వరకూ కొనసాగుతుంది.
సభ జరిగినన్ని రోజులు ఉదయం 9 గంటల నుంచి అది ఎన్ని గంటల వరకూ కొనసాగితే అన్ని గంటల వరకూ అర్థరాత్రి, అపరాత్రనే తేడా లేకుండా జర్నలిస్టులు తమ వృత్తిధర్మం ప్రకారం, బాధ్యతగా పడిగాపులుగాచి, సమావేశాలను కవర్ చేస్తుంటారు. సభ సజావుగా నడిచి, అక్కడ అర్థవంతమైన చర్చలు జరిగి, తద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నదే వీరి తపన, తాపత్రయం. మీడియా ప్రతినిధులు, శానససభ సిబ్బంది, పోలీసులు, మేధావులు, సామాజికవేత్తలందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీయే అసలు సిసలు వేదికని బలంగా విశ్వసిస్తుంటారు. అందుకు భిన్నంగా మన ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తూ ‘ఆధిపత్యం’ కోసం, పాపులారిటీ కోసం అర్రులు చాస్తుండటం శోచనీయం. ఈ క్రమంలోనే ‘సభను సాంకేతికంగానే నడుతపుతున్నారు’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికార, ప్రతిపక్షాలు ఈ పద్ధతికి స్వస్తిపలికి, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.