పుస్తక ప్రదర్శనలో

America in the hands of the elite!అక్కడ లక్షల పుస్తకాలు
గుసగుసలాడుతున్నాయి
ఒక్కోటి ఒక్కో ప్రపంచానికి
దారులు చెబుతున్నాయి

జీవితానికి వెలుగు దారి చూపే పుస్తకాలకు
లాంతర్ల వంటి శీర్షికలు
బతుకు బాధ తీర్చే భరోసానిచ్చే పుస్తకాలవి
పరిసరాలను ప్రకాశవంతం చేసే వాగ్దానాలు

డిసెంబరు చలిలో కూడా
కొన్ని పుస్తకాల పురా వాసనలు,
కొత్త పుస్తకాల సిరా పరిమళాలు
వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి

అక్కడ గాలి కూడా
తైతక్కలాడకుండా
కైతలను తడుముతుంది.

పుటల్లో దాగి ఉన్న కలలు
మీ కోసం ఎదురు చూస్తున్నాయి
నిజానికవి కాగితాలు కావు
మన పాలిటి కాంతి పుంజాలు
ప్రతి పేజీ మలుపు
జీవితాన్ని నడిపిస్తుంది
సిద్ధంగా వుండండి.

అక్కడ కొలువైన
అల్మరాల్లో నిలిచి ఉన్న క్లాసిక్‌లు
మెరిసే సూర్యకాంతి కిరణాలతో సంభాషిస్తాయి.

మీ హదయాలను విశాలంగా తెరిచి
పుస్తక ప్రదర్శన అంతా సంచరించండి
కొత్త రచనల్ని
తప్పక ఆలింగనం చేసుకోండి.
– కుడికాల వంశీధర్‌
(హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సందర్భంగా…)