సామాజిక ఆరోగ్య కేంద్రంలో విషమ పరిస్థితిలో ఉన్న గర్భిణిని రక్షించిన వైద్యులు

– తల్లీ బిడ్డ క్షేమం
నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ ఆసుపత్రి) సూపరింటెండెంట్ నేతృత్వంలో ఒక విషమ పరిస్తితి గల గర్భిణీకి వైద్యుల బృందం నిర్వహించిన క్రిటికల్ సిజేరియన్ సక్సెస్ అయ్యింది. ఆపరేషన్ అనంతరం పర్యవేక్షించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆదివారం ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జమ్మిగూడెం కు చెందిన ముప్పాళ్ళ కృష్ణవేణి రెండో కాన్పు కోసం శనివారం అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరింది.ఆమెకు మొదటి కాన్సు సాధారణంగా జరగటంతో వైద్యులు రెండో ప్రసవం కోసం కొద్ది సమయం వేచి చూసారు. పరీక్షించిన ప్రసూతి వైద్యురాలు రాధా రుక్మిణి కడుపులో బిడ్డ ఉమ్మ భాగంగానీరు తాగటం తో పాటు గర్భ సంచి గోడలకు రంధ్రాలు పడటం,శిశువు మెడలో పేగు చుట్టుకు పోవటం,దీర్ఘ ముఖం ఉండటాన్ని గుర్తించారు. కడుపులోనే బిడ్డ రంగు కూడా కొంత మారటం వైద్యులకు ఆందోళన కలిగించింది.వెంటనే అప్రమత్తమైన సూపరింటెండెంట్ గర్భణీకి అత్యవసరంగా సిజేరియన్ చేయాలని ప్రసూతి వైద్యుని తో చర్చించి నిర్ణయించుకున్నారు. పాల్వంచ నుండి మత్తు వైద్యులు ప్రసాద్ ను పిలిపించి శనివారం సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ చేసి పండంటి బాబును బయటకు తీశారు.అప్పటికే శిశువు మింగిన 25 ఎమ్ఎల్ ఉమ్మనీరు ను బయటకు తీశారు. 24 గంటల పాటు తల్లీ, బిడ్డ లను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆదివారం క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. బాబు బరువు తో పుట్టినట్లు వివరించారు. అశ్వారావుపేట ఆసుపత్రి చరిత్రలోనే ఇది అరుదైన ఆపరేషన్ గా వైద్యులు పేర్కొన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఎమర్జన్సీ సిజేరియన్ చేసి తల్లి బిడ్డను కాపాడిన  వైద్యుల బృందాన్ని బాలింత రాలు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందిుస్తున్నారు.