బీజేపీ అడుగుల్లోనే…

– చంద్రబాబుపై కేసు కేంద్రానికి తెలియకుండా జరిగింది కాదు: ఎంఎ బేబీ, బి.వి రాఘవులు
అమరావతి: వైసీపీ, టీడీపీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని, ఇది దురదృష్టకర పరిణామమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, బివి రాఘవులు అన్నారు. విజయవాడ బాలోత్సవ్‌ భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుతో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌డిఎలో ఉన్న అనేక పార్టీలు బయటకు వస్తున్నాయని, అయినా, ఈ రెండు పార్టీలూ కళ్లు తెరవడం లేదన్నారు. బి.వి.రాఘవులు మాట్లాడుతూ మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు గత్యంతరం లేక మద్దతు ఇచ్చాయని, స్వతహాగా ఇష్టం లేదని ప్రధాని మోడీ అన్నారని, వాస్తవానికి గతంలో మహిళా బిల్లును పెడుతున్న సమయంలో ఇదే బీజేపీ ఆసక్తి చూపలేదని చెప్పారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప అందరూ ఆమోదిస్తే దాన్ని పార్లమెంటు విజయంగా చెప్పకుండా బిజెపి తన సొంత గొప్పతనంగా చెప్పుకోవడం అసహ్యంగా ఉందన్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీ ఇప్పటి వరకూ ఎందుకు మహిళా బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు.