పశ్చిమబెంగాల్‌ లో ఘోరప్రమాదం

– బాణసంచా ఫ్యాక్టరీలో ఎనిమది మంది మృతి
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలింది. దీంతో అందులో పనిచేస్తున్న కార్మికులు 8 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది వర్కర్లు ఉన్నారనే విషయంపై స్పష్టత లేదని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్‌ 24 పరగణాల జిల్లా బరాసత్‌ లోని బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల భవనాలు కూడా బీటలువారాయి. లోపల ఉన్న కార్మికులు 8 మంది చనిపోయారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని స్థానికులు బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. స్టేట్‌ యూనివర్సిటీకి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా, జనావాసాల మధ్యే ఫ్యాక్టరీని నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.