సస్పెన్స్, క్రైమ్ జోనర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ జోనర్‌తో యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమే ‘అథర్వ’. నూతల పాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.
డైరెక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఒక క్రైమ్ సీన్‌లో క్లూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అయిన క్లూస్‌ని, ఎవిడెన్స్‌ని ఐడెంటిఫై చేసే క్లూస్ డిపార్ట్మెంట్ గురించే ఈ మూవీ’ అని తెలిపారు. ‘ఇదొక కొత్త కాన్సెప్ట్. క్లూస్ టీమ్ మీద ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరూ సినిమా తీయలేదు. డైరెక్టర్ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా ఇది. రీసెంట్‌గా క్లూస్ డిపార్ట్మెంట్‌కు ప్రత్యేక షో వేసినప్పుడు.. వాళ్లంతా సినిమా చూసి డైరెక్టర్ పర్ఫెక్షన్ చాలా బాగుందన్నారు. డిసెంబర్ 1న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది’ అని హీరో కార్తీక్ రాజు అన్నారు.
నిర్మాత సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ, ‘ఎంతో మంది ప్యాషన్ ఉన్న వాళ్ళు కలిసి కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఓ పక్క థ్రిల్ చేసే అంశాలు, మరో పక్క మంచి రొమాంటిక్ లవ్ ట్రాక్ పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ అవ్వడంతో సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని తెలిపారు.