ఫాతిమా ఆర్‌ఓబీ పనుల్లో తీవ్ర జాప్యం

Fatima ROB works seriously delayed– అత్యంత పొడమైన ఆర్‌ఓబీ నిర్మాణం
– ఏడేండ్లయినా పూర్తికాని వైనం
– రైల్వే శాఖ తీరుపై అసంతృప్తి
– రూ.78 కోట్లతో చేపట్టిన పనులు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ-కాజీపేట రైల్వేలైన్‌ మధ్యనున్న ఫాతిమానగర్‌ వద్ద అత్యంత పొడవైన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మాణానికి ఏడేండ్ల క్రితం పనులు ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తికాలేదు. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఆర్‌ఓబీ నిర్మాణానికి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017లో రూ.78కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను రెండేండ్లలో పూర్తి చేయాల్సి ఉంది. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తీవ్ర జాప్యం చేయడం ఈ ఆర్‌ఓబీ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారింది. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అంటున్నారు. ఆర్‌ఓబీ నగరానికి నడిఒడ్డున ఉండటంతో నిత్యం ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి నగరవాసులకు ఇబ్బందికరంగా మారింది. కాబట్టి బ్రిడ్జి త్వరగా నిర్మించి వాహనదారుల కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. కాజీపేట-బల్లార్ష రైల్వేలైన్‌ మీదుగా 1970లో నిర్మించిన ప్రస్తుత ఫాతిమానగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నగరంలో పెరిగిన ట్రాఫిక్‌ రద్దీకనుగుణంగా లేదు. నాటి జనాభాతో పోల్చితే గ్రేటర్‌ వరంగల్‌ నగర జనాభా పెరిగింది. వాహనాలు పెరిగి తీవ్ర ట్రాఫిక్‌ రద్దీతో నగరవాసులు సతమతమవుతున్నారు. దాంతో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాత బ్రిడ్జికి సమాంతరంగా మరోరైల్‌ ఓవర్‌ బ్రిడ్జిని (ఆర్‌ఓబీ) నిర్మించడానికి రూ.78కోట్లతో నాటి సీఎం కేసీఆర్‌ 2017 అక్టోబర్‌ 22న శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని డిసెంబర్‌ 31, 2021లో పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తికాలేదు. పలు సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న ఆర్‌ఓబీపై ప్రమాదం జరిగితే రెండువైపులా ట్రాఫిక్‌కు గంటల పాటు అంతరాయం ఏర్పడుతుంది.
రైల్వే అధికారుల జాప్యం
గడ్డర్స్‌ నిర్మాణంలో వినియోగించే మెటీరియల్‌, దాని డిజైనింగ్‌, తయారీ విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సందర్శించి ధృవీకరించడంలోనే తీవ్ర జాప్యం జరిగింది. 4ఏండ్లుగా రైల్వే ట్రాక్‌పై 150మీటర్ల మేరకు పనులు నిలిచిపోయాయి. రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాల మేరకు ఈ ఆర్‌ఓబీ నిర్మాణంలో భాగంగా ట్రాక్‌ మీదుగా బ్రిడ్జిలో చేసే నిర్మాణం యావత్తు రైల్వే అధికారుల పరిశీలనలో చేయాల్సి ఉంది. ఇందుకు వినియోగించే మెటీరియల్‌ను స్వయంగా రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి ధ్రువీకరించాలి. ఇదే క్రమంలో ఆర్‌ఓబీకి వినియోగించే గడ్డర్స్‌ డిజైనింగ్‌, నిర్మాణాన్ని తయారీ కేంద్రం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించి నాణ్యతను ధ్రువీకరించాకే గడ్డర్స్‌ను ప్రతిపాదిత ఆర్‌ఓబీ స్థలానికి తరలిస్తారు. కాగా, ఈ విషయాన్ని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఈ పనుల్లో వేగం పెరగకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఆర్‌ఓబీలు పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల రైల్వే అధికారులు సకాలంలో పర్యవేక్షణ, పరిశీలన పూర్తి చేసి ధ్రువీకరించలేక పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అత్యంత పొడవైన ఆర్‌ఓబీ
జాతీయ రహదారి 163 మీద హన్మకొండ-కాజీపేట మధ్య ఫాతిమానగర్‌ వద్ద నిర్మిస్తున్న ఆర్‌ఓబీ అత్యంత పొడవైనదని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్‌ఓబీలో రైల్వే ట్రాక్‌ మీద వినియోగించనున్న గడ్డర్స్‌ బరువు 800 టన్నులు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ హన్మకొండ జిల్లా అధికారులు రెండు వైపులా, ట్రాక్‌పై మినహా నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ గడ్డర్స్‌ను ఆర్‌ఓబీలో వినియోగించడానికి ఇంత భారీ బరువును ఆపగలిగేలా స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసి రెండు భారీ క్రేన్‌లతో అమర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫాతిమానగర్‌ సెయింట్‌ గాబ్రియేల్స్‌ హైస్కూల్‌ మైదానానికి రెండు గడ్డర్స్‌ చేరుకున్నట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.హైదరాబాద్‌
మార్చిలోపు పూర్తి
2025 మార్చిలోపు ఫాతిమానగర్‌ ఆర్‌ఓబీ పనులు పూర్తి కానున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులు పూర్తి చేశాం. దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే ట్రాక్‌పై ఆర్‌ఓబీలో వినియోగించే గడ్డర్స్‌ నిర్మాణంలో పూర్తిగా రైల్వే అధికారుల పరిశీలన, నిర్ధారణ చేసి ధ్రువీకరించిన తరువాతే పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు గడ్డర్స్‌ ఫాతిమా నగర్‌కు చేరుకున్నాయి. వచ్చే మార్చిలోపు నిర్మాణం పూర్తవు తుంది.
పి. సురేష్‌బాబు, ఆర్‌అండ్‌బీ ఈఈ, హన్మకొండ