అతివకు అందలం

Adialabad,Navatelangana,Telugu News,Telangana.– మహిళా సాధికారతకు రుణాలు శ్రీ కొత్త సభ్యులు చేరేలా విస్తృత ప్రచారం
– లక్ష్య సాధన దిశగా ఐకేపీ అధికారుల కసరత్తు
– ఈ ఏడాది వార్షిక లక్ష్యం రూ.14 కోట్లు
ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోంది. వారికి సకల సదుపాయాలు కల్పించడంతోపాటు వ్యాపార పరంగా రాణించేందుకు అనేక రకాల అవకాశాలు కల్పిస్తోంది. సంక్షేమ ఫలాలు మరికొంతమందికి అందించాలనే ఉద్దేశంతో నూతన సభ్యత్వాలు. నూతన పొదుపు సంఘాలను ప్రోత్సహించే దిశగా ఐకేపీ అధికారులు అడుగులు వేస్తున్నారు. నూతన సభ్యత్వాలు, చిన్న సంఘాల ఏర్పాటు ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి మహిళకు సభ్యత్వం ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు లక్ష్యాల ను సైతం విధించడం విశేషం.
నవతెలంగాణ-కెరమెరి
మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో 470 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 4500 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ సంఘాలలో లేని వారిని గుర్తించి సభ్యత్వం కల్పించేలా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా యాక్టీవ్‌గా ఉన్న సంఘాలతో పాటు కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేలా తోడ్పాటును అందించనున్నారు.
కొత్త కోడళ్ళకు అవకాశం
లక్ష సాధనలో గ్రామాల వారీగా కొత్తగా సంఘంలో సభ్యులను చేర్పిస్తున్నారు. ఇందుకోసం అధికారులు ఐకేపీ అధికారులు వివిధ రకాల ప్రణాళికలను రూపొందిస్తూ కసరస్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన్ని అనే సందర్శించి 60 ఏండ్లు దాటిన సభ్యులకు ఆయా సంఘాల నుంచి సభ్యత్వాన్ని రద్దు చేస్తుండంతో కొత్తగా వారిని చేర్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది 340 మందికి సభ్యత్వం ఇవ్వాల్సిన లక్ష్యం కాగా మండలంలో ఇప్పటివరకు 5 సంఘాలు, దాదాపు 55 మంది సభ్యులను చేర్పించారు. మరో 285 మందిని మార్చి నాటికి చేర్పించాల్సి ఉంది. ఇందులో ఎక్కువగా కొత్త కొడళ్ళని, సంఘాల్లో లేని వారిని సంఘాల్లో చేర్పిస్తున్నారు.
మహిళా అభ్యున్నతికి కృషి
మహిళలను ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఐకేపీ అధికారులు. సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సభ్యులకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలను అందిస్తూ చేయూతనిస్తున్నారు. ఇందు కోసం సంబంధిత అధికారులు స్థానికంగా అంతకు ముందున్న గ్రామ సామ్యక్య సంఘాల సహకారం తీసుకొని నూతన సభ్యులను చేర్పించే ప్రక్రియకు పూనుకున్నారు.
470 సంఘాలు రూ.14 కోట్ల రుణాలు
ఈ ఏడాది మండలంలోని యాక్టివ్‌గా ఉన్న 470 స్వయం సహాయక సంఘాలకు రూ.14 కోట్ల రుణాలు అందించనున్నారు. ఇందులో ఇప్పటికే 59 సంఘాలకు రూ.1 కోటి 97లక్షలను అందించారు. మార్చినాటికి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిచేసేలా స్వయం సహాయక సంఘాల సీసీలు, గ్రామ దీపికలు, గ్రామ సమైక్య అధ్యక్షులు రుణాలు ఇప్పించేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో మండలంలోని పలు గ్రామాల మహిళలుతో మండల కేంద్రంలోని బ్యాంకు వద్ద సందడి నెలకొంటుంది.
విస్తృత ప్రచారం చేస్తున్నాం దుర్గం శంకర్‌, సీసీ కెరమెరి
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. అందుకు కొత్తగా వచ్చే కోడలును సైతం సభ్యులుగా చేర్చుకునేందుకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. కొత్త సభ్యులు చేరికగా మంచి స్పందన వస్తుంది. పేద మహిళల అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తాం
మహిళలు సద్వినియోగం చేసుకోవాలిలి జగదీశ్వర్‌, ఐకేపీ ఏపీఎం, కెరమెరి
నూతన సంఘాలతో సభ్యులను చేర్పించేందుకు అవకాశం కల్పించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రుణాలు పొంది ఆర్థిక అభివృద్ధి సాధించారు. ఏడాది మండలంలో రూ.14,44 కోట్లు లక్ష్యంగా రుణాలను మార్చినాటికి అందించేలా కృషి చేస్తాం.