కేసీఆర్‌కు ఏటీఎం కాళేశ్వరం ప్రాజెక్ట్‌

ATM Kaleswaram project for KCR– తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేశారని విమర్శ
– రాహుల్‌గాంధీ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన
– అంబట్‌పెల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-భూపాలపల్లి/మహాదేవపూర్‌
కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా ఉపయోగపడిందే కాని ఏ ఒక్క రైతుకూ దీనివల్ల ఉపయోగం లేదని కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని రాహుల్‌గాంధీ గురువారం సందర్శించారు. ఆయనతోపాటు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, భూపాలపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఉన్నారు. గంటసేపు అక్కడే ఉన్నారు. ముందుగా హెలికాప్టర్‌ నుంచి ఏరియల్‌ వ్యూ ద్వారా రాహుల్‌ మేడిగడ్డను పరిశీలించారు. అనంతరం కుంగిన మేడిగడ్డ బ్యారేజీ 15 బ్లాక్‌ నుంచి 25 బ్లాక్‌ వరకు కాంగ్రెస్‌ నేతలతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు పరిస్థితిని ఇంజినీర్లను అడిగి తెలుసుకు న్నారు. కాగా, అంబట్‌పెల్లి గేట్‌ నుంచి ప్రాజెక్టు గేటు వద్దకు వారు వెళ్లగా సీఆర్పీఎఫ్‌ ప్రత్యేక పోలీస్‌ బలగాలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని కళ్లారా చూడ్డానికే ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. అనంతరం ట్వీట్‌ చేశారు. నాసిరకం నిర్మాణం కారణంగా పలు స్తంభాలకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. స్తంభాలు మునిగిపోయి ఉన్నా యని నివేదికలో ఉందన్నారు. ప్రాజెక్టు ద్వారా నష్ట పోయిన రైతులు, ప్రజలకు న్యాయం చేస్తామని వెల్లడించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్డాడు తూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై న్యాయ విచారణ జరిపించి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని, ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో ఈ ప్రాంతంలో వందల ఎకరాల పంటలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మేడిగడ్డ ఘటన మరువకముందే అన్నారం ప్రాజెక్టులో నీటి బుంగలు ఏర్పడి నీరు పైకి ఉబికి వస్తూ ఉండటం వెనుక ఎలాంటి నిర్లక్ష్యం ఉందో తెలుస్తుందని అన్నారు.
హైటెన్షన్‌ వాతావరణం
అంతకుముందు మేడిగడ్డ వద్ద హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మేడిగడ్డకు వెళ్లే దారులన్నీ పోలీసులు మూసేశారు. అప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు.. బారీకేడ్లను తోసుకుంటూ దూసుకెళ్లారు. కాగా 144 సెక్షన్‌ అమలులో ఉందని.. అనుమతి లేదని పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో వారంతా అంబటిపెల్లి గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
దోపిడీ సొమ్మును ప్రజల ఖాతాల్లో జమచేస్తాం
–  రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ : మహిళా సాధికారిత సదస్సులో రాహుల్‌
కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే ప్రజా తెలంగాణ సాధ్యమని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రాజెక్టుల పేరిట సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్న సొమ్మును కక్కించి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం అంబటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టంచేశారు. మోడీ, కేసీఆర్‌ పాలనలో సిలిండర్‌ ధర రూ.1200కు చేరిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.500కు వంట గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి ప్రజల తెలంగాణగా మారుస్తామని తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వనున్నట్టు వెల్లడించారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ మూడు ఒక్కటేనని ఆక్షేపించారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. సభలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, భూపాలపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావుతో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు, మండల నాయకులు కోట రాజబాబు, అక్బర్‌ ఖాన్‌, ఎంపీపీ రాణిబారు, జెడ్పీటీసీ గూడాల అరుణ, జిల్లా అధ్యక్షులు ప్రకాష్‌ రెడ్డి, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, అంబటిపల్లి సర్పంచ్‌ విలాస్‌ రావు పాల్గొన్నారు.