అమ్మ మెడికల్‌ షాప్‌పై దాడి

– రూ.2.22 లక్షల మందులు సీజ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌ మండలం, అమన్‌గల్‌ గ్రామంలోని అమ్మ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌పై విశ్వసనీయ సమాచారం మేరకు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా చట్టవిరుద్ధంగా నడిపిస్తూ మెడికల్‌ షాపులో నిల్వ ఉంచిన రూ.2.22 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు జె.భాగ్యలక్ష్మి, జె.నర్సింహ ఈ మెడికల్‌ షాపును నడిపిస్తున్నట్టు తెలిపారు. 75 రకాల ఔషధాలను గుర్తించగా అందులో యాంటీ బయాటిక్స్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ అల్సర్‌ తదితర మందులున్నాయి. డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా మందుల విక్రయాలు, నిల్వలు ఉంచే వారిని ఎవరినీ వదిలేది లేదని డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ వీ.బీ.కమలాసన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఔషధాలకు సంబంధించి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై తమ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-599-6969కి పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.