ఆశా వర్కర్లపై దాడి అమానుషం

– మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడబిడ్డలైన ఆశావర్కర్ల మీద పోలీసులచేత అమానవీయంగా దాడి చేయించారని ఆరోపించారు. మహిళలని చూడకుండా మగ పోలీసులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో అశాలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల దాడిలో గాయపడ్డ వారి నాయకురాలు సంతోషి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, వెంటనే ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఆశాలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి
ఆశావర్కర్లపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మగ పోలీసులు వారి చీరలను ఇష్టమొచ్చినట్టు లాగారనీ, ఇదేనా ప్రజా పాలనా? అంటూ నిలదీశారు. ఏసీపీ శంకర్‌ మహిళలపై స్వయంగా దాడి చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారి గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచగా, కాంగ్రెస్‌ సర్కార్‌ మాత్రం ఉన్న హక్కులను కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌ బిల్లుల కోసం ఉద్యమిస్తున్న మాజీ సర్పంచ్‌లను జైల్లోకి పంపుతున్నారని విమర్శించారు. పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ, మాజీ సర్పంచ్‌ల బిల్లులు ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలన పట్ల ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ తల్లులే కాంగ్రెస్‌ సర్కార్‌కు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.