– పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా
కడియం : అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ముగ్గురు దళిత యువకులపై పెత్తందారులు దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు.. మండపేట పట్టణంలో రెల్లి సామాజిక తరగతికి చెందిన బొత్స మోహన్ కిరణ్ తన కుటుంబం సభ్యులతో కలిసి పట్టణంలోని ఒక సినిమా థియేటర్‌కు వెళ్ళారు. ఈ క్రమంలో స్టాండ్‌లో ఉన్న ఒక బైక్ కిందపడిపోయింది. కొద్దిసేపటి తర్వాత మోటార్ సైకిల్ యజమాని, అతని స్నేహితులు వచ్చి బైక్‌ను కిందపడేసిన వారి కోసం థియేటర్ లోపలికి వెళ్లారు. దీంతో కిరణ్ బయటకు వచ్చి మోటార్ సైకిల్ బాగు చేయించి ఇస్తానని చెప్పినా గొడవకు దిగారు. కిరణ్ స్నేహితులైన కొల్లి చంటి, పాలపర్తి చంద్రశేఖర్‌పైనా దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో కిరణ్ అక్కడి నుండి పారిపోయారు. కిరణ్ స్నేహితులను మోటార్ సైకిల్ యజమాని తమ గ్రామమైన మండపేట మండలం ఏడిదకు తీసుకువెళ్లారు. అక్కడ వారిని చేతులు కట్టేసి కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగారు. సుమారు 40 మంది దాడికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు.ఈ విషయం తెలియడంతో పరిసర ప్రాంతాలకు చెందిన దళితులు పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు
ఈ ఘటనలో ఏడిద గ్రామానికి చెందిన ఎనిమిది మందిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మండపేట రూరల్ సిఐ పి.దొర రాజు తెలిపారు. ఈ కేసులో మరికొందరు నిందితులుగా ఉన్నారని, వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.