సంచలనం కోసమే దుబ్బాక అభ్యర్థిపై దాడి

– ఎంపీపై హత్యాయత్నం చేసిన నిందితుని అరెస్ట్‌
– సిద్దిపేట పోలీస్‌ కమీషనర్‌ ఎన్‌.శ్వేత
– ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న కేసు విచారణ
నవ తెలంగాణ సిద్దిపేట అర్బన్‌
సంచలనమైన సంఘటన చేయడం ద్వారా తనపై అందరి దృష్టి పడాలనే హత్యాయత్నానికి పాల్పడినట్టు దుబ్బాక అభ్యర్థి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు రాజు చెప్పినట్ట్టు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. బుధవారం సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలోని సూరంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన ఘటం రాజు(40) కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడని తెలిపారు. దౌల్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నామని, ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను విచారించి.. సాంకేతిక నైపుణ్యంతో ఆధారాలు సేకరించామన్నారు. నిందితుడు ఘటం రాజు విలేకరి అని చెప్పుకుంటూ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు చేసే వాడన్నారు. అతనిపై ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు. ఈ క్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని చంపాలనే ఉద్దేశంతోనే దుబ్బాక మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేసి హత్యకు యత్నించినట్టు తెలిపారు. హత్యకు యత్నించిన ప్రదేశంలో నిందితుడిని అక్కడున్న ప్రజలు కొట్టి గాయపరిచారని తెలిపారు. రాజును అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన అనంతరం నిందితుడు రాజును తొగుట సీఐ కమలాకర్‌ బుధవారం అదుపులోకి తీసుకొని విచారించగా.. సంచలనమైన సంఘటన చేయడం ద్వారా తనపై అందరి దృష్టి పడాలనే హత్యాయత్న చేశానని నేరాన్ని ఒప్పుకున్నట్టు సీపీ తెలిపారు. నిందితుడు నేరం చేయడానికి గల ఇతర కారణాలు ఉన్నాయా.. నిందితుడికి ఈ నేరం చేసేందుకు ఎవరైనా సహకరించారా.. ఎవరైనా ప్రోత్సహించారా.. అన్న కోణాల్లోనూ విచారణ కొనసాగుతుందని సీపీ శ్వేత తెలిపారు.