– మనుధర్మం అమలుకు కుట్ర
– విద్యార్థినులకు మల్లు స్వరాజ్యమే స్ఫూర్తి
– పోరాటాలకు సిద్ధం కావాలి : ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా గర్ల్స్ కన్వీనర్ దీప్సితా ధర్
నవతెలంగాణ-నల్లగొండటౌన్
బేటీ బచావో బేటీ పడావో.. దేశంలో నరేంద్ర మోడీ హటావో.. అని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా గర్ల్స్ కన్వీనర్ దీప్సితా ధార్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థుల భారీ ర్యాలీ అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో సభ నిర్వహించారు. సభలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, వివక్ష పెరిగిపోతోందన్నారు. లైంగికదాడులు చేసిన వారిని జైల్లో పెట్టకుండా.. నిందితులకు బెయిల్ ఇచ్చి.. వారికి బీజేపీ సన్మానాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ బేటీ పడావో బేటీ బచావో అంటూనే ఆడపిల్లలపై చెప్పరాని వివక్ష చూపుతున్నారన్నారు. అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ‘నా మాటే తుపాకి తూట’ అన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో విద్యార్థినులు ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ బహిరంగ సభ ఉపయోగపడుతుందన్నారు. దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాల రైతులు, తల్లిదండ్రులు పిట్టల్లా రాలిపోతున్నా ఏమి చేస్తున్నారని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోని విద్యాసంస్థల్లో మత ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసే విధంగా పాఠ్యాంశాలలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ జాతీయ విద్యా విధానం పూర్తిగా పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా ఉందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌ఎల్.మూర్తి, తాళ్ల నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో విద్యార్థినుల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఎస్‌ఎఫ్‌ఐ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా భోజనం పెట్టాలన్నారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలన్నారు. విద్యారంగంలో వస్తున్న సమస్యలపై ఎప్పటికప్పుడూ ప్రత్యేక కమిటీ వేసి ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు తక్షణమే మెస్ చార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ మమత, జిల్లా గల్స్ కన్వీనర్ కావ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షుడు లక్ష్మి నారాయణ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు కోట్ల అశోక్ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, శంకర్, స్పందన, అంజలి, బిందు, మాధవి, దేవి, రేణుకా పాల్గొన్నారు.