ఢిల్లీలో రైతులపై దాడి అమానుషం

– పండించిన పంటకు మద్ధతు ధర అడగడమే శాపమా?
– గత ఉద్యమ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
– రైతులు మళ్ళీ రోడ్లెక్కడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం
– టీపీటీఎఫ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి సంగ శ్రీనివాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
ఢిల్లీలో రైతులపై దాడి చేయడం అమానుషమని టీపీటీఎఫ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి సంఘ శ్రీనివాస్ అన్నారు మండలంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సంగ శ్రీనివాస్  మాట్లాడుతూ.. పండించిన పంటలకు కనీస మద్ధతు ధరను చట్టబద్ధం చేయాలని, రుణమాఫీ అమలు చేయాలని, పంట వ్యర్ధాలను కాల్చివేస్తున్న రైతులపై కేసులు పెట్టడం మాని ప్రత్యామ్నాయాలను సూచించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న రైతులపై లాఠీచార్జి చేసి, రబ్బరు బుల్లెట్ల ప్రయోగించడం సిగ్గుచేటు అని అన్నారు. గతంలో వాహనాలతో తొక్కించి రైతుల హత్యకు కారణమైతే, ఇప్పుడు పోలీసు దాడులతో రైతుల ప్రాణాలు తీయడం నిరంకుశ పాలనకు నిదర్శనం. ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సర కాలం పాటు నిర్వహించిన రైతుల ఉద్యమాన్ని విరమించడానికి చర్చల్లో అనేక హామీలను ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చకపోవడం వల్లనే మళ్ళీ రైతులు రోడ్లెక్కిన విషయం గుర్తుంచుకోవాలి. రైతులు మళ్ళీ ఉద్యమ బాట పట్టడానికి కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అని ఆవేదన వ్యక్తి చెందారు. రైతుల మీద విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్న పోలీసులు, వారికి సహకరిస్తున్న హర్యానా ప్రభుత్వం మీద న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేయాలి డిమాండ్ చేశారు. రైతు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి మూడు సంవత్సరాలు గడిచినా నెరవేర్చకుండా రైతులను మోసాగించినందుకు వారికి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా వారి డిమాండ్లను నెరవేర్చి ఉద్యమాన్ని విరమింపచేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లికుదురు మండలం  శాఖ డిమాండ్ చేస్తుంది. ఈకార్యక్రమంలో జి.ఉదయ్ కిరణ్, కే. బిక్షపతి,బి.బిక్షపతి, నర్సయ్య,కే.జయప్రకాష్, బి.కిషన్ తదితరులు పాల్గొన్నారు.