– పోటీ మనదే.. గెలుపూ మనదే : వేముల వీరేశం
– ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామా…
– చిరుమర్తికి వీరేశం సవాల్
నవతెలంగాణ-నకిరేకల్
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ మనదే గెలుపు మనదే అంటూ నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు. గురువారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో వీరేశం జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పోటీ చేసేది మీరు.. నేను కాదు అని, కార్యకర్తలకు అండగా ఉంటానని, గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ ద్రోహులను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జెండా మనది.. పార్టీ మనది.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మన నాయకులు, మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలో పోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించింది మనం, కార్యకర్తలు బలంగా ఉండాలని, ఈ ప్రాంతంలో అభివద్ధి పనులు జరగాలంటే మనం రావాలని, నియోజకవర్గంలో మన గెలుపు తథ్యమని, నకిరేకల్లో మన గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. అభిమానం అనేది అణిచివేస్తే రాదని, సేవ చేస్తే వస్తదని చెప్పారు. టిక్కెట్ తీసుకోకుండా ఇంటి పెండెంట్‌గా పోటీ చేద్దామా అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వేముల వీరేశం సవాల్ విసిరారు. నాలుగున్నర సంవత్సరాలుగా తన వెనకాల నిలబడ్డ ప్రతి కార్యక్తను కాపాడుకుంటానని, కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో పని చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. తొలుత హైద్రాబాద్ నుండి భారీ కాన్వారులో నకిరేకల్ బయల్దేరిన వీరేశం బషీర్ బాగ్‌లో శ్రీ కనకదుర్గ, శ్రీ నాగలక్ష్మీ మాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన ఆయన సుమారు 10 వేల బైక్‌లతో ర్యాలీగా నకిరేకల్‌కు చేరుకున్నారు. ఆ తరువాత స్థానిక కనకదుర్గ, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ళు, కోలాట ప్రదర్శనలు, ఆటపాటలు, అభిమానుల కేరింతల నడుమ భారీ ర్యాలీగా జన్మదిన వేడుకలు జరిగే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలకు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్ హాజరై వీరేశంతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా వీరేశంకు కేకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వీరేశానికి టిక్కెట్ ఇప్పించి గెలిపించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఉద్యమ నాయకుడికి పట్టం కట్టాలని, వీరేశానికి అండగా ఉంటామని తెలిపారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ వీరేశం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని, సీఎం కేసీఆర్ వీరేశానికే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నామని, భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ మాజీ చైర్మెన్ పూజర్ల శంభయ్య, హైకోర్టు అడ్వకేట్ చలకాని వెంకన్న, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..