మహిళపై లైంగికదాడికి యత్నం

– అవమానంతో పురుగుల మందు తాగిన బాధితురాలు
– వేములపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగా- వేములపల్లి
వివాహిత ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దాంతో అవమానభారంతో ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
లక్ష్మీదేవిగుడెం గ్రామానికి చెందిన గంట క్రిష్ణయ్య గత నెల 21 తేదీన రాత్రి సమయంలో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి భయపెట్టి లైంగికదాడికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటపడటంతో పారిపోయాడు. అనంతరం మహిళ మనస్తాపంతో పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు సూర్యాపేట ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌ స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులు గత నెల 22వ తేదీన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కావడంతో స్థానిక కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధి సమక్షంలో రాజీ చేయడానికి ప్రయత్నించి విషయాన్ని గోప్యంగా ఉంచారు. అదే సమయంలో నిందితుడు క్రిష్ణయ్య కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నడు. కానీ బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. నిందితునిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన రోజే కేసు నమోదు చేసినట్టు, డీఎస్పీ ఆధ్వర్యంలో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.