– యూఎస్‌పీసీ, జాక్టో నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తేయాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) కోరింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఉవిధంగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించింది. యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. యూఎస్‌సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, వై అశోక్ కుమార్, పి నాగిరెడ్డి, టి లింగారెడ్డి, యు పోచయ్య, డి సైదులు, షౌకత్ అలీ, రాజయ్య, కొమ్ము రమేష్, జాదవ్ వెంకట్రావు, డి రాజనర్సు, జాడి రాజన్న, ఎస్ హరికిషన్, బి కొండయ్య, కె బిక్షపతి, వై విజయకుమార్, ఎం రఘుశంకర్ రెడ్డి అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీ, ఉపాధ్యాయ పదోన్నతులు కోరుతూ 2020, డిసెంబర్ 29న ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో యూఎస్‌పీసీ, జాక్టో ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, టి లింగారెడ్డి, జి సదానందంగౌడ్‌లపై అక్రమంగా పెట్టిన క్రిమినల్ కేసును ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల, సమగ్ర శిక్ష, ఎయిడెడ్ సిబ్బందికి నవంబర్, డిసెంబర్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. గత ఏడాది కాలంగా ట్రెజరీల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే చెల్లించాలని తెలిపారు. 317 జీవో అమలు సందర్భంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలు నిర్వహించాలని సూచించారు. ఆటంకాలను తొలగించి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలనీ, ఎఫ్‌ఎల్‌ఎన్, ఉన్నతి అమలు తీరును సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి సమస్యలపై చర్చించాలని నిర్ణయించామని తెలిపారు.