వేలం పాట

వేలం పాటఊరన్నాక పనులు చేయించుకునే పెద్ద మనుషులు, సేవలు చేసే చిన్న మనుషులూ వుండాల్సిందే కదా. ఊరన్నాక ఓ బడీ, ఓ గుడీ వుండాల్సిందే కదా. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా గుళ్లు బాగా అభివృద్ధిలోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక బడులూ, పాడ బడిన గోడలు, విరిగిన కుర్చీలు, మూడు కాళ్ల బల్లలు మామూలే.
గుడి ముఖ్యమా బడి ముఖ్యమా అనడిగితే ఎవరైనా గుడే ముఖ్యం అంటారు. గుడి కోసమైతే విరాళాల జల్లులు కురుస్తయి. గుడి కట్టేవాడి పాపాలు పటాపంచలవుతాయి. నల్లడబ్బు వదిలించుకోవచ్చు, కీర్తి మూటకట్టుకోవచ్చు. ఈ దాతృత్వానికి దేవుడు మెచ్చి గుడికట్టినవాడి కోసం స్వర్గంలో ఓ గెస్ట్‌హౌస్‌ రిజర్వు చేసి పెట్టనూవచ్చు.
బడిని పట్టించుకునేవాడేడీ. బడి బాగా కట్టి చదువులు బాగా చెప్పి మంచి పౌరుల్ని తయారు చేస్తే వారు ప్రశ్నించడం మొదలు పెడ్తారు. సక్రమంగా ఓటు హక్కు ఉపయోగించుకుంటారు. పెద్దగా చదువుకోని వాళ్లను ఎన్నుకోడానికి పెద్ద చదువులు చదివిన ఓటర్లు అవసరం లేదు కదా! అందువల్ల ప్రభుత్వాలు చదువు చెప్పే పని మానేసి చదువును అమ్ముకోండోరు అని ప్రైవేటు దుకాణాల వారికి అప్పచెప్పేశారు. టీవీలు అమ్మేవాడికి టీవీ అసెంబ్లింగ్‌, కార్లు అమ్మేవాడికి డ్రైవింగ్‌ తెలీడం అవసరం లేదు కదా. అందువల్ల విద్యావ్యాపారవేత్తలు విద్యావేత్తలయ్యే అవసరం లేదు. పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, కాలేజిలు పెట్టినా అనే అవిద్యావేత్తకు ఓ నలభై చదువమ్మే దుకాణాలుండవచ్చు. పది మద్యం దుకాణాలున్న వాడికి ఇరవై ఇంగ్లీషు మీడియం స్కూళ్లుండవచ్చు. వ్యాపారమన్నాక మందయితేనేం, చదువయితేనేం, అమ్మిన వెలలోంచి పెట్టుబడి వెల తీసేస్తే మిగిలేదంతా లాభమే కదా!
ఊరేదయితేనేం ఆ ఊళ్లో ఓ బడి వుంది. బడి గవర్నమెంటుది కనుక ఉండాల్సినవేవీ లేవు. పదిమంది పంతుళ్లకి నలుగురే మిగిలారు. ఒక్క తరగతి గది కూలితే పక్కనున్న తరగతి గది రెండు క్లాసులవుతుంది. కూలిన గోడల్లో బ్రహ్మజెముడు కుటుంబంతో వుంటుంది. బడి పూర్తిగా శిథిలమైపోయింది. కొత్త గదులు కట్టించాలని ఊరి సర్పంచి బుట్టదాఖలా అయ్యేందుకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వందలకోట్లు ఖర్చుపెట్టి గుళ్లూ, కూలే బ్రిడ్జీ కట్టే సర్కార్‌కు బడ్జెట్లో బడులు కట్టించేందుకు డబ్బు కొరత వుంటుంది కదా!
ఊరి జనం రెక్కాడితే కాని డొక్క నిండని జనం మాత్రం ఏం చేయగలరు. స్వంత డబ్బు ఖర్చుపెట్టలేరు. సర్కారువారు స్వంత పైసా ఖర్చుపెడ్తారా, పన్నులు కడుతున్నాం ఆ మాత్రం చెయ్యరా అని అరచి అరచి అరవలేక మూసుకున్నారు నోళ్లు. తనను సర్పంచుగా ఎన్నుకుంటే బడి కట్టించేస్తానని హామీ ఇచ్చిన సర్పంచి, సర్కారు చెవి ముందు శంఖం ఊది ఊది, ఊదడం మానేశాడు.
సర్పంచులు, ఎం.ఎల్‌.ఎ.లు, ఎం.పీ.లు ఎవరూ శాశ్వతం కాదు కదా. పదవుల కోసం మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టాల్సిందేకదా. పెట్టిన సొమ్ము రాబట్టుకుందుకు నల్ల కళ్లజోళ్లు పెట్టుకోవల్సిందే కదా!
ఊళ్లో సర్పంచు ఎన్నికలొచ్చేయి. ఈసారన్నా ఊళ్లో బడిని పట్టించుకునేవాణ్ని ఎన్నుకుందామనుకున్నారు అందరూ ఎప్పటిలాగే. ఎప్పటిలాగే కొత్త సర్పంచు కూడా చెవిటి సర్కారు ముందు శంఖం ఊది ఊది చేతులు ఎత్తేస్తే మళ్లీ ఎన్నికలొస్తయి తప్ప బడి గోడలు పైకి లేవవు అనుకున్నారు. ఎన్నుకోవలసిన వాళ్లు ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. తెగ ఆలోచించి ఓ పరిష్కారం కనుక్కున్నారు.
పార్టీలతో పనిలేదు. వ్యక్తులతోనూ పనిలేదు. డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. కనుక డబ్బే ముఖ్యం కనుక డబ్బునే సర్పంచుగా ఎన్నుకుందామనుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్ని కలలో కన్నవాళ్లు, ఎన్నికలలో తమ సత్తా చూపారు. మేం ఓట్లు వెయ్యం అని మొండికేశారు. ఓట్లు వెయ్యకుండా ఎన్నికలు జరగవు. ఎన్నికలు జరక్కపోతే సర్పంచి ఎలా? సర్పంచి లేకుండా ఊరు ఏమైపోతుందని గుండెలు బాదుకున్నారు పెద్దలు కొందరు వయసులో.
ఎన్నికలు జరగకుండానే ఓట్లు వెయ్యకుండానే సర్పంచు ఎన్నిక జరుగుతుందన్నారు వార్డు మెంబర్లు.
ఎన్నిక జరిగేరోజు రానే వచ్చింది. ఊరి పెద్దలు, ఓటు వెయ్యాల్సిన వాళ్లు, రచ్చబండ దగ్గర గుమిగూడారు. ఓటు మీ హక్కు, ఓటు మీ చేతిలో వజ్రాయుధం, ఓటేసేవారు రండి రండి అన్నాడు ఎన్నికల నిర్వాహకుడు. మేమెవ్వరం ఓటు వెయ్యం కానీ సర్పంచిను ఎన్నుకుంటాం అన్నారు ఓటర్లు. అదెలా? ఓటు వెయ్యకుండా ఎన్నికలా? ఎన్నికలంటేనే ఓట్లు కదా అనరిచారు ప్రజాస్వామ్యాన్ని నెత్తిన పెట్టుకు మోసేవాళ్లు.
ఈ ఊరి బడి పునర్నిర్మాణం కోసం మేం ఎన్నికల్ని బహిష్కరిస్తాం కానీ సర్పంచిను బహిష్కరించం అన్న ఈ తిరకాసు ఎవరికీ అర్ధం కాలేదు. అప్పుడో మనిషి ముందుకు వచ్చేడు. బడి ఎవరు కట్టిస్తే వారే సర్పంచు అన్నాడు. నేనంటే నేనని ముందుకు దూకారు పదవి మీద మోజుపడ్డ వాళ్లు ‘మాటే’ కదా ఇస్తే పోలా అనుకున్నారు. ఓసారి ఎన్నికయ్యాక, మళ్లీ ఎన్నికలదాకా మనల్ని అడిగేవాడు వుండడు అనుకున్నవాళ్లు.
అందరూ నేను నేననేవాళ్లే కాని ఆ ఒక్క నేను ఎవరో తేల్చటానికి ‘వేలంపాట’ పాడాలని, ఎవరు ఎక్కువ పాట పాడి ఆ డబ్బు జమ చేస్తారో వారే సర్పంచి అని పట్టుబట్టారు ఓటర్లు. ఇది పద్ధతి కాదు. ఇది ఎక్కడా లేదు అని వెనక్కితగ్గారు సర్పంచి పదవి అప్పనంగా పొందాలనుకున్నవారు. వేలం పాట జరిగింది. పది లక్షలు పాడి సర్పంచు పదవి ఒకడు కొనుక్కున్నాడు. కొనుక్కున్న మనిషికే ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు ఓటర్లు.
ఈ పద్ధతేదో కొత్తగా వుందే అన్నాడు పొరుగు ఊరి నుంచి వచ్చిన ఓ వ్యక్తి. ఇది కొత్తదేమీ కాదు. దేశంలో ఇప్పుడు జరుగుతున్నదిదే. గొంతెమ్మ కోర్కెలు తీర్చే పార్టీల మేనిఫెస్టోలు, ఒకరిని మించి ఒకరుగా నాయకుల గ్యారెంటీలు, హామీలు ఒకరకంగా వేలంపాటే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారికే ఓటు వేస్తామనే ఓటర్లున్నారు. ఒకరికంటే ఒకరు ఎక్కువ డబ్బిచ్చి ఓట్లు కొనుక్కునే లీడర్లు వున్నారు. ప్రజాస్వామ్యాన్ని వేలంపాట స్థాయికి దిగజారుస్తున్నారు అన్నాడు ఈ ఊరి వ్యక్తి.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212